అనకాపల్లి జిల్లాలో మరో బోటు ప్రమాదం..
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండటంతో మత్స్యకారుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. విశాఖలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదం విషాదం మరువక ముందే, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మరో బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మత్స్యకారుడు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు ఒక్కసారిగా అలల తాకిడికి గురై సముద్రంలో తిరగబడింది. అందులో ఉన్న నలుగురు మత్స్యకారుల్లో ముగ్గురు ప్రాణాలతో బయటపడగా, ఒకరు గల్లంతయ్యారు. తర్వాత ఆయన మృతదేహం బంగారమ్మపాలెం తీరానికి కొట్టుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.
మృతిచెందిన మత్స్యకారుడిని సింహాద్రిగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మిగతా ముగ్గురు సురక్షితంగా ఉన్నారని ధృవీకరించారు.
ఇక మరోవైపు విశాఖ తీరంలో జరిగిన భారీ బోటు ప్రమాదం ఇంకా కొనసాగుతోంది. జూలై 1న చేపల వేటకు వెళ్లిన బోటు తిరుగు ప్రయాణంలో భారీ అలల తాకిడికి గురై బోల్తా పడింది. అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు చిన్న బోటు సహాయంతో ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ బోటు కూడా మునిగిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది.
ఒక మర్చంట్ నౌక సహాయంతో బోటు యజమాని కారి చిన్నను మాత్రమే సిబ్బంది రక్షించగలిగారు. మిగతా ఆరుగురు మత్స్యకారులు ఇప్పటికీ గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అయితే అధికారులు సరైన సమయంలో స్పందించలేదంటూ మత్స్యకారుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ త్వరగా తెలియజేయాలని కన్నీటి పర్యంతమవుతున్నారు.
వరుసగా జరుగుతున్న ఈ బోటు ప్రమాదాలు తీర ప్రాంత మత్స్యకారుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే సముద్రం ప్రమాదకరంగా ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఈ దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)