25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు వచ్చాడు.. విలువలకు నిలువెత్తు నిదర్శనం

Jul 10, 2026 - 13:30
0 2
25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు వచ్చాడు.. విలువలకు నిలువెత్తు నిదర్శనం

నేటి కాలంలో చిన్న మొత్తాల అప్పులు కూడా తిరిగి చెల్లించకుండా తప్పించుకునే ఘటనలు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తీర్చేందుకు కేరళ నుంచి తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురికి వచ్చిన ఓ వ్యక్తి నిజాయితీ, స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.

కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలోని ఒకే కంపెనీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో వ్యక్తిగత అవసరాల కోసం ఇస్మాయిల్.. లచ్చన్న వద్ద నుంచి కొంత నగదును అప్పుగా తీసుకున్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ డబ్బు తిరిగి చెల్లిస్తానని మాటిచ్చారు.అయితే, స్వదేశానికి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోవడంతో లచ్చన్నను సంప్రదించే అవకాశం ఇస్మాయిల్‌కు దొరకలేదు. అయినప్పటికీ తీసుకున్న అప్పును మాత్రం ఆయన ఎప్పుడూ మరచిపోలేదు.

ఇటీవల ఎలాగైనా ఆ రుణం తీర్చాలని నిర్ణయించుకున్న ఇస్మాయిల్.. లచ్చన్న పూర్తి చిరునామా లేదా ఫోన్ నంబర్ లేకపోయినా, ఆయన స్వస్థలం ధర్మపురి అనే ఒక్క సమాచారం ఆధారంగా గూగుల్‌లో వెతికి జగిత్యాల జిల్లాకు చేరుకున్నారు. స్థానికులను అడిగి చివరకు లచ్చన్న ఇంటిని గుర్తించారు.ఆ సమయంలో లచ్చన్న విదేశంలో ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి తనను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఫోన్‌లో లచ్చన్నతో మాట్లాడారు. అప్పు ఇచ్చిన విషయాన్ని మరచిపోయిన లచ్చన్న.. పాత మిత్రుడి గొంతు వినగానే గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు.

తర్వాత మహ్మద్ ఇస్మాయిల్ రూ.25 వేల నగదును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇన్నేళ్లుగా తన మనసులో ఉన్న రుణభారం ఇప్పుడు తీరిందంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. స్నేహితుడు 25 ఏళ్ల తర్వాత కూడా మాట నిలబెట్టి అప్పు తీర్చేందుకు ప్రత్యేకంగా రావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని లచ్చన్న కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు మహ్మద్ ఇస్మాయిల్ నిజాయితీ, కృతజ్ఞత, స్నేహబంధానికి విలువ ఇచ్చిన తీరును ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చర్చనీయాంశంగా మారింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User