శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. భారత నౌకాదళంలోకి మరో మహా అస్త్రం
భారత నావికాదళ బలాన్ని మరింత పెంచే మరో అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి సేవలకు సిద్ధమైంది. విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జూలై 11న జరగనున్న కమిషనింగ్ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యుద్ధనౌకను అధికారికంగా భారత నావికాదళానికి అంకితం చేయనున్నారు.
శత్రు రాడార్లకు చిక్కకుండా సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే స్టెల్త్ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి, భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది. మూడు వైపులా సముద్రం ఉన్న భారతదేశానికి సముద్ర భద్రత అత్యంత కీలకమైన నేపథ్యంలో ఈ యుద్ధనౌక వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రాజెక్ట్ 17ఏలో ఆరో యుద్ధనౌక
శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్లకు కొనసాగింపుగా చేపట్టిన ప్రాజెక్ట్-17ఏ కింద మొత్తం ఏడు అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్లను నిర్మిస్తున్నారు. వాటిలో ఆరో నౌకే ఐఎన్ఎస్ మహేంద్రగిరి. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వతం పేరు మీద ఈ యుద్ధనౌకకు నామకరణం చేశారు.ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) ఈ నౌకను నిర్మించగా, భారత నౌకాదళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీనిని రూపకల్పన చేసింది.
అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు
ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో బ్రహ్మోస్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, 76 మిల్లీమీటర్ల నేవల్ గన్, టార్పెడో వ్యవస్థలు, రాకెట్ లాంచర్లు, ధ్రువ్, సీ కింగ్ హెలికాప్టర్లను నిర్వహించే సదుపాయం కల్పించారు. శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాములను గుర్తించేందుకు అత్యాధునిక రాడార్, సోనార్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు.ఈ యుద్ధనౌక పొడవు 149 మీటర్లు, వెడల్పు 17.8 మీటర్లు, బరువు సుమారు 6,670 టన్నులు. గంటకు 28 నాట్స్ వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది.
స్వదేశీ సాంకేతికతకు నిదర్శనం
ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారు. దీంతో ఇది 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ నౌక నిర్మాణంలో అనేక భారతీయ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు భాగస్వామ్యం కావడం దేశీయ రక్షణ తయారీ రంగానికి మరింత ఊతమిచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.
హిందూ మహాసముద్రంలో కీలక బాధ్యతలు
అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత, తక్కువ రాడార్ గుర్తింపు, అధిక స్థాయి ఆటోమేషన్, శక్తివంతమైన రక్షణ వ్యవస్థలతో రూపొందిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో నిఘా, సముద్ర భద్రతా కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత సముద్ర ప్రయోజనాల పరిరక్షణలో ఈ యుద్ధనౌక వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారనుంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)