సెలైన్‌లో టాయిలెట్ క్లీనర్ ఇంజెక్ట్ చేసిన భార్య.. వివాహేతర సంబంధం కోసం భర్త హత్య

Jul 07, 2026 - 14:54
0 4
సెలైన్‌లో టాయిలెట్ క్లీనర్ ఇంజెక్ట్ చేసిన భార్య.. వివాహేతర సంబంధం కోసం భర్త హత్య

నిజామాబాద్ జిల్లాలో అత్యంత దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య సంధ్య, ఆమె ప్రియుడు బంటి కలిసి భర్త ప్రశాంత్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మేడపై నుంచి తోసేసిన తర్వాత కూడా ప్రాణాలతో బయటపడిన భర్తను ఆస్పత్రిలోనే సెలైన్‌లో టాయిలెట్ క్లీనర్ ఇంజెక్ట్ చేసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్‌కల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి పని చేసేవాడు. ఆ సమయంలో అతని భార్య సంధ్యకు స్థానిక యువకుడు బంటితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారినట్లు విచారణలో తేలింది.

కొద్ది రోజుల క్రితం గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ప్రశాంత్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమ సంబంధానికి ప్రశాంత్ అడ్డుగా మారాడని భావించిన సంధ్య, ప్రియుడు బంటితో కలిసి అతడిని హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

గత నెల 30న ప్రశాంత్‌కు అధికంగా మద్యం తాగించి, పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత ఇంటి మేడపై నుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలతో ఉన్న ప్రశాంత్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అతడు ప్రాణాలతో బయటపడటాన్ని జీర్ణించుకోలేకపోయిన సంధ్య.. ఆస్పత్రిలోనే మరో దారుణానికి పాల్పడినట్లు విచారణలో బయటపడింది.

ప్రియుడు బంటి తెచ్చిన సిరంజి సహాయంతో టాయిలెట్ క్లీనర్‌ను ప్రశాంత్‌కు ఎక్కిస్తున్నసెలైన్‌లోకి ఇంజెక్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ రసాయనం శరీరంలోకి చేరడంతో ప్రశాంత్ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం మద్యం మత్తులో మేడపై నుంచి పడిపోవడం వల్లే భర్త చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

అయితే పోస్ట్‌మార్టం నివేదికలో ప్రశాంత్ శరీరంలో రసాయనాలు ఉన్నట్లు తేలడంతో కేసు మలుపు తిరిగింది. పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రియుడు బంటితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User