బాసర జ్ఞానసరస్వతి గర్భాలయం మూసివేత.. ఇక బాలాలయంలోనే అమ్మవారి దర్శనం

Jul 07, 2026 - 15:16
0 4
బాసర జ్ఞానసరస్వతి గర్భాలయం మూసివేత.. ఇక బాలాలయంలోనే అమ్మవారి దర్శనం

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో గర్భాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు బాలాలయంలోనే అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శృంగేరి శారదా పీఠం ఉభయ జగద్గురువుల ఆశీస్సులతో ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ జ్ఞానసరస్వతి, మహంకాళి, లక్ష్మీదేవి అమ్మవార్లతో పాటు ఇతర దేవతామూర్తులకు వేదపండితుల ఆధ్వర్యంలో విశేష ద్రవ్యాభిషేకాలు, మూలమంత్ర హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ బాలాలయంలో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ ప్రధాన దాతలు సురపునేని సునంద్–పద్మప్రియ దంపతులు, స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆలయ ఈవో అంజనీదేవి పాల్గొని భూమిపూజ నిర్వహించారు.

ఆలయ పునర్నిర్మాణం పూర్తయ్యే వరకు అక్షరాభ్యాసాలు, నిత్యపూజలు, అభిషేకాలు, ఇతర ఆర్జిత సేవలన్నీ బాలాలయంలోనే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. గర్భాలయంలో మాత్రం ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు మాత్రమే నిత్యపూజలు నిర్వహించనున్నారు.

పునర్నిర్మాణంలో భాగంగా ఆలయానికి నాలుగు వైపులా భారీ రాజగోపురాలు నిర్మించనున్నారు. తూర్పు, పడమర గోపురాలను ఐదు అంతస్తులతో, దక్షిణ గోపురాన్ని ఏడు అంతస్తులతో, ఉత్తర గోపురాన్ని తొమ్మిది అంతస్తుల ఎత్తుతో నిర్మించనున్నారు. ఈ ఉత్తర రాజగోపురం పూర్తయితే తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ఆలయ గోపురంగా నిలవనుంది.

ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు గర్భాలయాన్ని మూసివేయడంతో అమ్మవారిని చివరిసారిగా గర్భగుడిలో దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఒక్క రోజే 951 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం విశేషంగా నిలిచింది.

పునర్నిర్మాణ పనులు పూర్తైన తర్వాత మరింత వైభవంగా, దివ్యంగా బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయం భక్తులకు దర్శనమివ్వనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User