మావయ్య సినిమాకి అల్లుడి క్లాప్.. అమరావతిలో బాలయ్య 112 గ్రాండ్ లాంచ్

Jun 25, 2026 - 16:16
0 3
మావయ్య సినిమాకి అల్లుడి క్లాప్.. అమరావతిలో బాలయ్య 112 గ్రాండ్ లాంచ్

ప్రజా రాజధాని అమరావతి మరోసారి సినీ సందడికి వేదికైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న 112వ చిత్రం పూజా కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా బాలయ్య కొత్త సినిమా షూటింగ్‌కు నారా లోకేష్ క్లాప్ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుక అభిమానులను ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. బాలయ్య-కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించగానే సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.

పూజా కార్యక్రమం అనంతరం మాట్లాడిన నారా లోకేష్.. తన జీవితంలో తొలిసారిగా సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన మావయ్య బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిని భవిష్యత్తులో సినీ పరిశ్రమకు కూడా ఒక ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో సినిమాలతో పాటు క్రియేటర్ ఎకానమీకి కూడా ప్రోత్సాహం అందించేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని లోకేష్ వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమా కార్యక్రమాలు అమరావతి వేదికగా జరగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో NBK 111 చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుత స్పందన లభించింది. దీంతో NBK 111 తర్వాత రానున్న NBK 112పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అమరావతి వేదికగా బాలయ్య కొత్త సినిమా ప్రారంభం కావడం, మావయ్య సినిమా కోసం అల్లుడు లోకేష్ క్లాప్ కొట్టడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User