డూప్ లేకుండా యాక్షన్ సీన్లు.. చలిలో శరీరం ఫ్రీజ్.. ‘నాగబంధం’ కోసం విరాట్ కర్ణ సాహసాలు

Jul 01, 2026 - 16:40
0 1
డూప్ లేకుండా యాక్షన్ సీన్లు.. చలిలో శరీరం ఫ్రీజ్.. ‘నాగబంధం’ కోసం విరాట్ కర్ణ సాహసాలు

‘పెదకాపు’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కర్ణ నటించిన రెండో చిత్రం ‘నాగబంధం’జులై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో విరాట్ కర్ణ షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను వెల్లడించారు.

రెండు పాత్రల కోసం భారీ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్

ఈ సినిమాలో తాను ‘రుద్ర’, ‘నాగసాధు’ అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు విరాట్ కర్ణ తెలిపారు. రుద్ర పాత్ర కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగానని, ఆ తర్వాత నాగసాధు పాత్ర కోసం ఆ బరువంతా తగ్గించడమే కాకుండా మరో 5 కిలోలు అదనంగా తగ్గానని చెప్పారు. పాత్రకు తగ్గట్టుగా కనిపించేందుకు హార్స్ రైడింగ్, డ్యాన్స్‌లలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.

ఆరు గంటల మేకప్.. రాత్రంతా షూటింగ్

నాగసాధు పాత్ర కోసం ప్రతిరోజూ దాదాపు ఆరు గంటల పాటు మేకప్ వేసేవారని విరాట్ చెప్పారు. ఎక్కువ భాగం షూటింగ్ రాత్రి వేళల్లో జరగడంతో పగటిపూట కారవాన్‌లో విశ్రాంతి తీసుకుని, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు షూటింగ్‌లో పాల్గొనేవాడినని తెలిపారు. పాత్రలో పూర్తిగా లీనమయ్యేందుకు ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడినని, షూటింగ్ పూర్తయ్యాక శివమాల కూడా ధరించానని చెప్పారు.

చలిలో శరీరం ఫ్రీజ్.. ఆస్పత్రికి తరలింపు

డిసెంబర్ నెలలో తీవ్రమైన చలిలో నాగసాధు పాత్ర చిత్రీకరణ జరిపినట్లు విరాట్ తెలిపారు. సాధువు పాత్ర కావడంతో ఒంటిపై చాలా తక్కువ వస్త్రాలతోనే నటించాల్సి వచ్చిందని చెప్పారు. ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో చలి తీవ్రత కారణంగా శరీరం పూర్తిగా ఫ్రీజ్ అయి కదలలేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే చిత్రబృందం ఆస్పత్రికి తరలించిందన్నారు. చికిత్స అనంతరం మరుసటి రోజే తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు వెల్లడించారు.

డూప్ లేకుండా అన్ని స్టంట్స్

సినిమాలోని ప్రతి యాక్షన్ సీన్‌ను డూప్ లేకుండా స్వయంగా చేశానని విరాట్ కర్ణ తెలిపారు. రిస్క్ ఉన్నప్పటికీ పాత్ర కోసం వెనకడుగు వేయలేదని చెప్పారు. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

‘శ్రీమంజునాథ’ నుంచి స్ఫూర్తి

చిరంజీవి నటించిన ‘శ్రీమంజునాథ’చిత్రం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని విరాట్ కర్ణ చెప్పారు. శివుడికి సంబంధించిన పాత్రలో నటించే ముందు ఆ సినిమాను పలుమార్లు చూసి చిరంజీవి నటనను పరిశీలించానని వెల్లడించారు. భవిష్యత్తులో ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన

‘నాగబంధం’ట్రైలర్‌కు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన వచ్చిందని, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలకు మించి జరుగుతున్నాయని విరాట్ కర్ణ తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని తప్పకుండా ఆస్వాదిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User