సింగపూర్‌కు సముద్ర మార్గంలో తొలి ఆంధ్రా మామిడి
ఆంధ్రప్రదేశ్ రైతులకు చెందిన ప్రీమియం బంగినపల్లి మామిడి పండ్లు తొలిసారిగా సముద్ర మార్గం ద్వారా విజయవంతంగా సింగపూర్‌కు చేరాయి. భారత వ్యవసాయ ఎగుమతుల చరిత్రలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
ఏపీలోని జీఏపీ (Good Agricultural Practices) ధ్రువీకరణ పొందిన తోటల నుంచి సేకరించిన 5 మెట్రిక్ టన్నుల బంగినపల్లి మామిడి పండ్లను శుద్ధి చేసి, ప్యాకింగ్ అనంతరం జూన్ 11న సముద్ర మార్గంలో సింగపూర్‌కు పంపించారు. ఈ కన్సైన్‌మెంట్ జూన్ 24న సురక్షితంగా సింగపూర్ రేవుకు చేరుకుంది.
ఈ ఎగుమతి ప్రక్రియను వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (APEDA) పర్యవేక్షించింది. లక్నోలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ (CISH) శాస్త్రీయ సలహాలు అందించగా, కర్ణాటకలోని అపెడా గుర్తింపు పొందిన ప్యాక్‌హౌస్‌లో మామిడిని ప్రాసెస్ చేశారు.
ఈ ఎగుమతితో రైతులకు గణనీయమైన ఆర్థిక లాభం చేకూరింది. స్థానిక మార్కెట్లో కిలో మామిడి ధర రూ.25-26 ఉండగా, ఎగుమతి ద్వారా కిలోకు సుమారు రూ.50 వరకు లభించింది. దీంతో రైతుల ఆదాయం దాదాపు రెట్టింపు అయింది.
సింగపూర్‌కు చెందిన దిగుమతి సంస్థ ఈసీ-లింక్స్ లిమిటెడ్ బంగినపల్లి మామిడి నాణ్యతను ప్రశంసించింది. తియ్యదనం, ఒకే రీతిలో పక్వానికి రావడం, ఎక్కువకాలం నిల్వ ఉండే లక్షణాలు ఆకట్టుకున్నాయని తెలిపింది.
వాయు మార్గంతో పోలిస్తే సముద్ర మార్గం తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణ హితమైనదిగా నిరూపితమైంది. ఈ విజయంతో భారతీయ ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరిన్ని అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)