చిట్టీల పేరుతో రూ.3 కోట్ల మోసం.. రాత్రికి రాత్రే పరారైన దంపతులు

Aug 03, 2026 - 18:18
0 3
చిట్టీల పేరుతో రూ.3 కోట్ల మోసం.. రాత్రికి రాత్రే పరారైన దంపతులు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. స్థానికంగా టెక్స్‌టైల్ వ్యాపారం నిర్వహిస్తూ కాలనీవాసుల నమ్మకాన్ని సంపాదించిన ఓ దంపతులు, మహిళలను చిట్టీల్లో చేర్చి కోట్ల రూపాయలు వసూలు చేసిన అనంతరం పరారయ్యారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన శిరీష, సాంబశివరావు దంపతులు గత కొన్నేళ్లుగా బీరంగూడలో నివాసముంటూ 'సాయి గణేష్ టెక్స్‌టైల్స్' పేరుతో వ్యాపారం నిర్వహించారు. కాలనీలోని మహిళలతో సన్నిహితంగా మెలిగి, చిట్టీల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. అనంతరం చిట్టీ డబ్బులను తమ వద్దే ఉంచితే ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి సుమారు 50 మంది మహిళల నుంచి దాదాపు రూ.3 కోట్లు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మొదట కొంతకాలం వడ్డీలు చెల్లించిన దంపతులు, తర్వాత డబ్బులు ఇవ్వాలని అడిగిన వారికి ఖాళీ చెక్కులు ఇచ్చి కాలయాపన చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అనంతరం బట్టల దుకాణం, ఇల్లు విక్రయించి రాత్రికి రాత్రే పరారయ్యారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమ కష్టార్జితాన్ని తిరిగి ఇప్పించాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User