ఘనంగా టీటీడీ ‘ప్రతిభా పురస్కారం–2026’..147 మంది విద్యార్థులకు సన్మానం

Jul 16, 2026 - 15:45
0 8
ఘనంగా టీటీడీ ‘ప్రతిభా పురస్కారం–2026’..147 మంది విద్యార్థులకు సన్మానం

టీటీడీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 147 మంది విద్యార్థులకు ‘ప్రతిభా పురస్కారం–2026’ను తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో డా. ఎ. శరత్, బోర్డు సభ్యులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి టీటీడీ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 33 విద్యాసంస్థల్లో సుమారు 20 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, వారికి నాణ్యమైన విద్యతో పాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. క్రమశిక్షణ, విలువలు, కృషితో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ.. విద్యే జీవితాన్ని మార్చే శాశ్వత సంపద అని పేర్కొన్నారు. గ్రామీణ, రైతు కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు టీటీడీ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా టీటీడీ విద్యాసంస్థలను తీర్చిదిద్దేందుకు ఆధునిక మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, పోషకాహార భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు.

టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ.. టీటీడీ 150 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ‘ప్రతిభా పురస్కారాలు’అందజేయడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. రూ.162 కోట్లతో విద్యాసంస్థలను ఆధునికీకరిస్తూ డిజిటల్ క్లాస్‌రూములు, కంప్యూటర్ ల్యాబ్‌లు, సీసీటీవీ వ్యవస్థలు, ఇతర ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలతో పాటు తిరుపతి, తిరుమలలోని వివిధ టీటీడీ విద్యాసంస్థలకు చెందిన 147 మంది విద్యార్థులను సన్మానించారు. ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి ఐదు గ్రాముల వెండి డాలర్, మెమెంటో, శాలువా, ప్రశంసాపత్రం అందజేశారు. అనంతరం విద్యార్థులు తమ గురువులను గౌరవిస్తూ కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User