హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రైవేట్ కాలేజీల నకిలీ ఫైర్ NOCల వ్యవహారం వెలుగులోకి
హైదరాబాద్‌లో సంచలనం రేపే ఫోర్జరీ కేసు వెలుగులోకి వచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని నకిలీగా ఉపయోగించి కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఫేక్ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (Fire NOC) సృష్టించినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గుర్తించింది. ఈ నకిలీ పత్రాలను బోర్డుకు సమర్పించినట్లు తేలడంతో అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరుతో సుమారు ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు ఫోర్జరీ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సమర్పించిన డాక్యుమెంట్లపై అనుమానం రావడంతో అధికారులు పరిశీలించగా అవి నకిలీవని నిర్ధారణ అయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వ్యవహారంలో బర్కత్‌పురాలోని హైందవీ జూనియర్ కాలేజీ, ఎస్‌ఆర్ నగర్‌లోని రెసోనెన్స్ జూనియర్ కాలేజీ, మెహిదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజీ, విద్యానగర్‌లోని మదర్స్ గాళ్స్ జూనియర్ కాలేజీ, చంద్రాయణగుట్టలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజీ, శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజీ, తెల్లాపూర్‌లోని వశిష్ట జూనియర్ కాలేజీల పేర్లు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా తీవ్రంగా స్పందించింది. ఫోర్జరీకి పాల్పడిన కాలేజీల గుర్తింపును రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)