ముంబైకి గుడ్‌బై చెప్పనున్న హార్దిక్ పాండ్య..?
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య భవిష్యత్తుపై మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. ట్రేడ్ విండో ద్వారా హార్దిక్ పాండ్య జట్టును వీడే అవకాశాలున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు ఏకంగా ఏడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సమాచారం ప్రకారం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మినహా మిగతా అన్ని జట్లు హార్దిక్‌ను ట్రేడ్ ద్వారా దక్కించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ముందంజలో ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా గట్టి పోటీ ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ సైతం ఈ రేసులో ఉన్నట్లు సమాచారం.
హార్దిక్ పాండ్య 2015లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి, 2021 వరకు ఆ జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగాడు. అనంతరం కొత్తగా లీగ్‌లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ అతడిని కెప్టెన్‌గా నియమించింది. తొలి సీజన్‌లోనే జట్టుకు ఛాంపియన్‌షిప్ అందించి తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించాడు.
రెండు సీజన్ల అనంతరం తిరిగి ముంబై ఇండియన్స్‌కు చేరి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే అతడి నాయకత్వంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ వరుసగా 10వ, 3వ, 9వ స్థానాలతో నిరాశపరిచింది. దీంతో హార్దిక్ భవిష్యత్తుపై ఊహాగానాలు మరింత పెరిగాయి.
ఇంగ్లండ్ పర్యటనకు కండరాల గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్య తన శిక్షణ విధానంలో కూడా కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇకపై బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)ను తన ప్రధాన శిక్షణ కేంద్రంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
భారత జట్టు లేదా ఐపీఎల్ బాధ్యతలు లేని సమయంలో బెంగళూరులోనే ఉండేందుకు సీఓఈ సమీపంలో నివాసాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని తన నివాసం నుంచి ప్రతిరోజూ ప్రయాణించడం కష్టంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.
అయితే హార్దిక్ పాండ్య ట్రేడ్‌పై ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ గానీ, హార్దిక్ పాండ్య గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)