టెస్టుల్లోకి కోహ్లీ రీఎంట్రీ?.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన కింగ్

Jun 23, 2026 - 16:24
0 3
టెస్టుల్లోకి కోహ్లీ రీఎంట్రీ?.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన కింగ్

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ రీఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఇటీవల జరిగిన తన స్పోర్ట్స్ బ్రాండ్ ‘వన్8’షూ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. టెస్ట్ క్రికెట్‌లో మళ్లీ ఆడే ఆలోచన లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు.

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ.. ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు టెస్ట్ ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్‌పైనే దృష్టి సారిస్తున్నాడు. అయితే ఇటీవల అతడు మళ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

ఇదే విషయంపై వన్8 బ్రాండ్ షూ లాంచ్ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కోహ్లీ టెస్ట్ కెరీర్‌లో చేసిన మొత్తం పరుగులు 9,230. అదే సంఖ్యను గుర్తుగా ఉంచుతూ కొత్త షూ ధరను రూ.9,230గా నిర్ణయించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు సరదాగా “ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే షూ ధర మరింత పెరిగేదేమో” అని వ్యాఖ్యానించాడు.

దీనికి స్పందించిన కోహ్లీ.. “నేను తక్కువ ధరకే అమ్మడానికి ఇష్టపడతాను. మీరు ఏ విషయాన్ని ఉద్దేశించి అడుగుతున్నారో దానితో నా పని అయిపోయింది. థాంక్యూ” అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్‌ను ఉద్దేశించిన ఈ వ్యాఖ్యతో కోహ్లీ రీఎంట్రీ అవకాశాలు లేవనే విషయంపై స్పష్టత వచ్చింది.

టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 123 మ్యాచ్‌లు ఆడి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా కూడా కోహ్లీ నిలిచాడు.

ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. తన కెరీర్ చివరి దశలో వన్డేలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగి ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

కోహ్లీ తాజా వ్యాఖ్యలతో టెస్ట్ రీఎంట్రీపై జరుగుతున్న చర్చలకు తెరపడినట్టే కనిపిస్తోంది. ఇక అభిమానులు అతడిని వన్డే ఫార్మాట్‌లోనే చూడాల్సి ఉంటుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User