వకుళామాత సన్నిధిలో 'అక్షర గోవిందం'
చిన్నారుల విద్యారంభం, జీవితారంభం దైవానుగ్రహంతో శుభప్రదంగా సాగాలని కోరుకునే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో "అక్షర గోవిందం" పేరుతో అక్షరాభ్యాసం, అన్నప్రాశన సేవలను జూలై 3 నుంచి ప్రారంభించనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాతల ఆశీస్సులతో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. అనంతరం ఆశీర్వచనం, ప్రసాదంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన "అక్షర గోవిందం కిట్"ను ఉచితంగా అందజేస్తారు.

ఈ కిట్‌లో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాత, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్ష వంటి పూజా, విద్యా సామగ్రి ఉంటుంది.అదేవిధంగా ఆలయ అర్చకుల పర్యవేక్షణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు తొలి అన్నప్రాశనను కూడా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
జూలై 4 నుంచి ప్రతి మంగళవారం మినహా అన్ని రోజుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ రెండు బ్యాచ్‌లలో మొత్తం 50 మంది చిన్నారులకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. పాల్గొనే తల్లిదండ్రులు గంట ముందుగానే ఆలయంలో నమోదు చేసుకుని, సంప్రదాయ వస్త్రధారణలో చిన్నారులతో హాజరుకావాలని టీటీడీ సూచించింది.
విద్యారంభం, అన్నప్రాశనం వంటి జీవితంలోని పవిత్ర ఘట్టాలను శ్రీ వకుళామాత సన్నిధిలో నిర్వహించుకునే ఈ అరుదైన అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)