టీటీడీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం.. రిటైర్మెంట్ రోజునే ఘన సన్మానం

Jul 01, 2026 - 13:34
0 2
టీటీడీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం.. రిటైర్మెంట్ రోజునే ఘన సన్మానం

శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో దశాబ్దాల పాటు అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు గౌరవప్రదమైన వీడ్కోలు పలికే వినూత్న సంప్రదాయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీకారం చుట్టింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన 122 మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవో డాక్టర్ ఎ. శరత్ తదితర అధికారులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ... ఉద్యోగులు పదవీ విరమణ పొందిన రోజునే వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా అందేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో సన్మాన కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించాలా, శాఖల వారీగా నిర్వహించాలా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ... ఒకే వేదికపై 122 మంది రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించడం టీటీడీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టమని పేర్కొన్నారు. ఈవో ఆలోచనల మేరకు తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించినట్లు వెల్లడించారు.

సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఉద్యోగుల సేవలకు గౌరవం తెలియజేసే ఈ కార్యక్రమం ఆదర్శప్రాయమని అన్నారు.

అనంతరం ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి శ్రీవారి ప్రసాదమైన లడ్డూ, వడ, అమ్మవారి కుంకుమ, పసుపు, రవికె, అక్షింతలు, తీర్థ ప్రసాదంతో పాటు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగభరితంగా సాగింది.

కార్యక్రమానికి ముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ప్రదర్శించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సౌకర్యంగా తమ ఇళ్లకు చేరుకునేందుకు టీటీడీ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది.

శ్రీవారి సేవలో జీవితాన్ని అంకితం చేసిన ఉద్యోగులకు గౌరవప్రదమైన వీడ్కోలు పలుకుతూ, "సేవే పరమో ధర్మః" అనే సందేశాన్ని టీటీడీ మరోసారి ఆచరణలో చాటింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User