"ఆనంద నిలయం" పేరు ఎలా వచ్చింది? శ్రీవారి ఆలయ గర్భగుడి విశిష్టత
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గర్భగుడిపై బంగారు కాంతులతో మెరిసే పవిత్ర విమాన గోపురాన్ని "ఆనంద నిలయం" అని పిలుస్తారు. తిరుమల ఆలయానికి ఇది ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అయితే ఈ పేరుకు వెనుక కేవలం నిర్మాణ వైభవం మాత్రమే కాకుండా గొప్ప ఆధ్యాత్మిక భావన కూడా దాగి ఉంది.
వైఖానస ఆగమ సంప్రదాయం, స్థలపురాణాల ప్రకారం "ఆనందం" అంటే పరమ సంతోషం, "నిలయం" అంటే నివాస స్థానం. పరమానందం నిత్యం కొలువై ఉండే దివ్య స్థలమే ఆనంద నిలయం అని అర్ధం . భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపే కేంద్రబిందువుగా ఈ విమాన గోపురం భావించబడుతుంది.
పురాణాల ప్రకారం కలియుగంలో భక్తులను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరస్వామిగా తిరుమలలో కొలువుదీరిన అనంతరం దేవతలు, మహర్షులు ఈ దివ్య విమానాన్ని "ఆనంద నిలయం"గా స్తుతించారని చెబుతారు. అప్పటి నుంచి ఈ పేరు ప్రసిద్ధి చెందింది.

భక్తులు శ్రీవారి దర్శనం పొందిన సమయంలో అనుభవించే ఆధ్యాత్మిక పరవశానికి ప్రతీకగా ఆనంద నిలయం నిలుస్తోంది. అందుకే తిరుమలకు వచ్చిన అనేక మంది భక్తులు ముందుగా ఈ బంగారు విమాన గోపురాన్ని దర్శించి నమస్కరించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
చరిత్రపరంగా కూడా ఆనంద నిలయానికి విశేష ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు సహా పలువురు రాజులు ఈ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించి మరింత వైభవాన్ని చేకూర్చారు. దీంతో ఆనంద నిలయం తిరుమల ఆలయ ఆధ్యాత్మికతకు, వైభవానికి ప్రతీకగా నిలిచింది.
పెద్దలు చెప్పే ఒక విశ్వాసం ప్రకారం... "శ్రీవారి దర్శనం మనసుకు ఆనందాన్ని ఇస్తే, ఆనంద నిలయ దర్శనం ఆ భక్తికి పరిపూర్ణతను ప్రసాదిస్తుంది." అందుకే ఆనంద నిలయం తిరుమల క్షేత్ర మహిమలో అత్యంత పవిత్రమైన భాగంగా భావించబడుతోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)