యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోండి.. టీటీడీ ఈవో పిలుపు

Jun 22, 2026 - 13:42
0 2
యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోండి.. టీటీడీ ఈవో పిలుపు

శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసానికి యోగ అత్యుత్తమ మార్గమని భారతీయ ఋషులు ప్రపంచానికి చాటి చెప్పారని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర పేర్కొన్నారు. అదే సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో టీటీడీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

జూన్ 21న తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ మైదానంలో ఈ యోగ దినోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో పాల్గొని యోగ ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతిరోజూ యోగాభ్యాసం చేయడం వల్ల శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మానసిక వికాసం, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. లక్షలాది మంది భక్తులకు సేవలందించే టీటీడీ ఉద్యోగులు యోగను అలవర్చుకుంటే ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన జీవితం సాధ్యమవుతుందని, అది వారి కుటుంబాల్లో కూడా సంతోషాన్నిపెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

గత 14 రోజులుగా క్రమశిక్షణతో యోగ సాధన చేసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఈవో ప్రత్యేకంగా అభినందించారు. తాను కూడా తొలుత బలవంతంగా యోగ ప్రారంభించినప్పటికీ, క్రమంగా అది జీవితంలో భాగమై ఆరోగ్యవంతమైన జీవనశైలికి దారి తీసిందని తన అనుభవాన్ని పంచుకున్నారు.

టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ ఈవో ఆదేశాల మేరకు జూన్ 7 నుంచి 21 వరకు టీటీడీకి చెందిన వివిధ సంస్థల్లో 14 రోజుల పాటు విస్తృత స్థాయిలో యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉద్యోగులందరూ యోగను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా "ధ్యాన మూలమిదం జగత్", "యోగ – ఒక పరిచయం" సీడీలు, పుస్తకాలను ఈవో ఆవిష్కరించారు. అలాగే స్విమ్స్ రూపొందించిన యోగ అవగాహన బ్రోచర్‌ను కూడా విడుదల చేశారు.

కార్యక్రమానికి ముందు పూజా కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన నిర్వహించగా అనంతరం ఈషా ఫౌండేషన్ రూపొందించిన యోగాసనాలను అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు సమిష్టిగా అభ్యసించారు. గత 14 రోజుల యోగ శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి ఈవో ప్రశంసా పత్రాలు అందజేశారు.

టీటీడీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User