గచ్చిబౌలిలో 82 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 82 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
గురువారం భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగోను కూడా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. 2028 డిసెంబర్ నాటికి యూనివర్సిటీ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులకు శిక్షణ, పరిశోధన, ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించే కేంద్రంగా ఈ యూనివర్సిటీని తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన ఆరుగురు క్రీడాకారులకు మొత్తం రూ.7.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను సీఎం అందజేశారు. షూటర్ ఈషా సింగ్‌కు రూ.3.30 కోట్లు, పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి రూ.50 లక్షలు, బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు రూ.2.10 కోట్లు, బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.60 లక్షలు, షూటర్ తనిష్క్ నాయుడుకు రూ.53.65 లక్షలు, షూటర్ సురభి భరద్వాజ్‌కు రూ.10 లక్షల చెక్కులను అందించారు.
రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపడుతున్నట్లు సీఎం తెలిపారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)