టీమిండియాకు షాక్.. గాయంతో నితీశ్ ఔట్.. యువ ఆటగాడికి అవకాశం

Jun 23, 2026 - 16:23
0 2
టీమిండియాకు షాక్.. గాయంతో నితీశ్ ఔట్.. యువ ఆటగాడికి అవకాశం

ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌లకు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఈ రెండు సిరీస్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్జెను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.

అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా నితీశ్ ఎడమ తొడ కండరాలకు గాయమైంది. వైద్య పరీక్షల్లో క్వాడ్రిసెప్స్ గాయం ఉన్నట్లు తేలడంతో కొంతకాలం విశ్రాంతి, పునరావాసం అవసరమని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. దీంతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు అతను అందుబాటులో ఉండడని బోర్డు స్పష్టం చేసింది.

ఇప్పటికే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జట్టుకు దూరం కాగా, ఇప్పుడు నితీశ్ కూడా తప్పుకోవడం టీమిండియాకు మరో ఎదురుదెబ్బగా మారింది. కీలక ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడం జట్టు సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

నితీశ్ స్థానంలో ఎంపికైన 23 ఏళ్ల సూర్యాంశ్ షెడ్జె ఇటీవల శ్రీలంకలో జరిగిన త్రైసిరీస్‌లో ఇండియా-ఏ తరపున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఐదు మ్యాచ్‌ల్లో 147 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ స్థిరమైన ప్రదర్శనలతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

జూన్ 26,28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న భారత్.. అనంతరం జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ రెండు సిరీస్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

భారత్ టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు కొత్తగా సూర్యాంశ్ షెడ్జె చోటు దక్కించుకున్నాడు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User