తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయమే తెలుగు రాష్ట్రాలు అమలు చేయాలి: స్వామి శ్రీనివాసానంద సరస్వతి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆలయాల నిర్వహణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి స్వాగతించారు.హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, అర్చకుల సంక్షేమం కోసం మాత్రమే వినియోగించాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.
తమిళనాడులో ఆలయాల ఆస్తులు, భూములు, ఆదాయాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించడం, వాటిని డిజిటలైజ్ చేయడం, ఆలయాలకు వచ్చే నిధులను ఇతర సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించకుండా దేవాలయాల అభివృద్ధికే కేటాయించే విధానాన్ని అమలు చేయడం మంచి నిర్ణయమని ఆయన అన్నారు. గతంలో ఆలయ నిధులతో చేపట్టాలని భావించిన కొన్ని వాణిజ్య ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఈ విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని శ్రీనివాసానంద సరస్వతి కోరారు. దేవాలయాలకు భక్తులు సమర్పించే నిధులు ఆలయాల పరిరక్షణ, అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలకే వినియోగించాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపైనా ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. హిందూ దేవుళ్లను కించపరిచే వ్యాఖ్యలు చేసే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడం సమర్థనీయమని అన్నారు. కొందరు వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఈ అంశాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అదే కార్యక్రమంలో పాల్గొన్న హిందూ సంఘాల నాయకుడు తురగా శ్రీరామ్ కూడా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొందరు యూట్యూబర్లు, జర్నలిస్టుల ముసుగులో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)