తిరుమల మాడవీధులకు వేదాలు, మహనీయుల పేర్లు

Jun 23, 2026 - 11:37
0 3
తిరుమల మాడవీధులకు వేదాలు, మహనీయుల పేర్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంపొందించే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, ప్రాంగణాలు, మాడవీధులకు పౌరాణిక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పేర్లను అధికారికంగా ఖరారు చేసింది.

ఈ నామకరణ ప్రక్రియ కోసం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ చక్రవర్తి, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ధూళిపాల ప్రభాకర కృష్ణమూర్తితో కూడిన నిపుణుల కమిటీని టీటీడీ ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసు చేసిన 38 పేర్లను టీటీడీ బోర్డు ఆమోదించింది.

శ్రీవారి ఆలయాన్ని చుట్టుముట్టిన నాలుగు మాడవీధులకు నాలుగు వేదాల పేర్లను ఖరారు చేశారు. తూర్పు మాడవీధికి ఋగ్వేద మార్గం, దక్షిణ మాడవీధికి యజుర్వేద మార్గం, పడమర మాడవీధికి సామవేద మార్గం, ఉత్తర మాడవీధికి అథర్వణవేద మార్గం అని నామకరణం చేశారు.

అదేవిధంగా జీఎన్సీ సర్కిల్ నుంచి నారాయణగిరి సర్కిల్ వరకు ఉన్న రింగ్ రోడ్డుకు తిరువేంకట పథం, లేపాక్షి సర్కిల్ నుంచి ఎస్ఎంసీ సర్కిల్ వరకు ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డుకు అన్నమాచార్య మార్గం పేర్లు పెట్టారు. జీఎన్సీ సర్కిల్ నుంచి అశ్విని ఆస్పత్రి వరకు ఆంజనాద్రి మార్గం, జీఎన్సీ నుంచి లేపాక్షి సర్కిల్ వరకు గరుడాద్రి మార్గం, పద్మావతి విచారణ కార్యాలయం నుంచి పద్మావతి అతిథిగృహం వరకు పద్మావతి మార్గంగా నామకరణం చేశారు.

బాలాజీ బస్టాండ్ నుంచి ఎంప్లాయీస్ క్యాంటీన్ వరకు కులశేఖరాళ్వార్ల మార్గం, రాంభగీచ నుంచి స్టాఫ్ క్వార్టర్స్ వరకు జయవిజయ మార్గం, నందకం నుంచి గోగర్భం డ్యాం వరకు నిత్యకల్యాణ మార్గం, వరాహస్వామి విశ్రాంతి గృహం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు శరణాగతి మార్గంగా పేర్లు ఖరారయ్యాయి.

అలాగే ఆకాశగంగ మార్గం, వేదవ్యాస మార్గం, అశ్వత్థనారాయణ మార్గం, శేషాచల మార్గం, శ్రీకృష్ణదేవరాయ మార్గం, ఆదివరాహ మార్గం, లక్ష్మీ హయగ్రీవ మార్గం, తరిగొండ వెంగమాంబ మార్గం, గోపీనాథ దీక్షిత మార్గం, గోకులం మార్గం, శ్రీమన్నారాయణ మార్గం, హథీరాం బావాజీ మార్గం, నీలాదేవి మార్గం, నమ్మాళ్వార్ మార్గం పేర్లను కూడా ఖరారు చేశారు.

భక్తులు నడిచి శ్రీవారిని దర్శించుకునే శ్రీవారి మెట్టు మార్గానికి ‘శ్రీవారి మార్గం’ అనే పవిత్ర నామకరణం చేశారు.

ప్రధాన ప్రాంగణాలు, కూడళ్లకు కూడా మహనీయుల పేర్లు ఖరారయ్యాయి. ఆలయం ముందు ఉన్న విశాల ప్రదేశాన్ని భగవద్రామానుజాచార్య ప్రాంగణం, బేడి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణాన్ని సాలువ నరసింహరాయుల ప్రాంగణం, కదిలే వంతెన నుంచి సుపథం వరకు ఉన్న ప్రాంతాన్ని తిరుమలనంబి ప్రాంగణం, ఆలయం వెనుక భాగాన్ని అనంతాళ్వార్ ప్రాంగణంగా నామకరణం చేశారు.

లేపాక్షి సర్కిల్‌కు అన్నమయ్య కూడలి, ఎస్ఎంసీ సర్కిల్‌కు పురంధరదాసు కూడలి, రాంభగీచ సర్కిల్‌కు తొండమాన్ చక్రవర్తి కూడలి, నందకం సర్కిల్‌కు వకుళమాత కూడలి, జీఎన్సీ సర్కిల్‌కు గరుడాద్రి కూడలి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 సర్కిల్‌కు తిరుమల రాయల కూడలిగా పేర్లు ఖరారయ్యాయి.

శ్రీవారి పరమ భక్తుడైన శరభయ్య పేరును కూడా ఒక ప్రధాన రహదారికి నామకరణం చేయాలని టీటీడీ బోర్డు ప్రత్యేకంగా సూచించింది. తిరుమలలో ప్రతి అడుగులోనూ భక్తి, చరిత్ర, సంస్కృతి, వేద వైభవం ప్రతిఫలించేలా తీసుకున్న ఈ నిర్ణయం భక్తుల్లో విశేష ఆనందాన్ని కలిగిస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User