తిరుమలలో 'నో హారన్' నిబంధన.. భక్తులకు ప్రశాంత వాతావరణం కోసం టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో భక్తులకు మరింత ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తిరుమల కొండపై, ఘాట్ రోడ్లలో అనవసరంగా హారన్లు, సైరన్లు వినియోగించవద్దని వాహనదారులకు సూచించింది.
ఈ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రధాన రహదారులు, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. తిరుమలలో గోవింద నామస్మరణ, వేదఘోషలతో నిండిన ప్రశాంత వాతావరణాన్ని పరిరక్షించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని టీటీడీ తెలిపింది.
ఈ మార్గదర్శకాలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలు, భక్తుల వ్యక్తిగత వాహనాలు, టీటీడీ వాహనాలు, పోలీసు వాహనాలు సహా అన్ని వాహనాలకు వర్తిస్తాయి. అత్యవసర పరిస్థితులు మినహా హారన్లు, సైరన్ల వినియోగాన్ని నివారించాలని అధికారులు సూచిస్తున్నారు.

రోజురోజుకూ తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, పవిత్రతను కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు టీటీడీ వెల్లడించింది.
ఈ నిబంధనలను భక్తులు స్వచ్ఛందంగా పాటించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అవసరమైతే నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు, జరిమానాలు విధించే అవకాశముందని కూడా స్పష్టం చేసింది.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రశాంతత, పవిత్రత, ఆధ్యాత్మికతను కాపాడడం ప్రతి భక్తుడి బాధ్యత అని టీటీడీ పేర్కొంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)