బాలకృష్ణ కాళ్లు మొక్కిన మమతా మోహన్ దాస్.. క్యాన్సర్ పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ స్పీచ్
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ నటి మమతా మోహన్ దాస్ వేదికపై నటుడు, హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం క్యాన్సర్‌తో తాను చేసిన పోరాటం గురించి మాట్లాడుతూ మమతా మోహన్ దాస్ ఎమోషనల్ అయ్యారు.
హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బాబీ కొల్లి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయించిన నటీమణులు గౌతమి, మమతా మోహన్ దాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మమతా మోహన్ దాస్.. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ కాదని, "రిఫ్రాక్టరీ హాడ్జ్‌కిన్స్ లింఫోమా" అనే అరుదైన రక్త క్యాన్సర్ సోకిందని వెల్లడించారు. వ్యాధి తీవ్రత కారణంగా కీమోథెరపీతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. సాధారణ చికిత్సలు ఫలితం ఇవ్వని సమయంలో అమెరికాలో నిర్వహించిన ప్రత్యేక క్లినికల్ ట్రయల్ తన ప్రాణాలను కాపాడిందని గుర్తు చేసుకున్నారు.
క్యాన్సర్‌తో పోరాటం తర్వాత జీవితంపై తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని మమతా చెప్పారు. ప్రస్తుతం తాను ప్రతి రోజును ధైర్యంగా జీవించడం, మానసికంగా బలంగా ఉండడం, జీవితాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెడుతున్నానని పేర్కొన్నారు.
క్యాన్సర్ రోగుల పట్ల జాలి చూపడం కంటే వారి పరిస్థితిని అర్థం చేసుకుని అండగా నిలవడం ముఖ్యమన్నారు. కుటుంబ సభ్యులు ఎప్పుడూ భయాందోళనలతో కనిపిస్తే రోగుల్లో మరింత భయం పెరుగుతుందని, వారికి ధైర్యం, ప్రేమ, సానుకూల వాతావరణం అందించడం అవసరమని సూచించారు.
గత 25 ఏళ్లుగా క్యాన్సర్ బాధితులకు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అందిస్తున్న సేవలను మమతా ప్రశంసించారు. వేలాది మంది రోగులకు ఈ ఆస్పత్రి ఆశాకిరణంగా నిలిచిందన్నారు.

మలయాళ చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన మమతా మోహన్ దాస్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. యమదొంగ, కృష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్, కేడి, హోమం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. నటిగా మాత్రమే కాకుండా గాయనిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
2009లో తొలిసారి క్యాన్సర్ బారిన పడిన మమతా చికిత్స తర్వాత కోలుకుని తిరిగి సినిమాల్లోకి వచ్చారు. అయితే 2013లో మళ్లీ వ్యాధి తిరగబెట్టినా ధైర్యంగా ఎదుర్కొని పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)