యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో కొత్త టూరిజం ప్యాకేజీ

Jul 04, 2026 - 10:14
Updated: 7 days ago
0 2
యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో కొత్త టూరిజం ప్యాకేజీ

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ఇకపై కేవలం భక్తి యాత్రకే కాకుండా పూర్తి స్థాయి పర్యాటక అనుభవంగా మార్చేందుకు తెలంగాణ టూరిజం శాఖ కొత్త అడుగు వేసింది. ఆలయ దర్శనంతో పాటు చరిత్ర, సంస్కృతి, హస్తకళలు, వారసత్వ ప్రదేశాలను ఒకే రోజులో సందర్శించే ప్రత్యేక "యాదాద్రి హెరిటేజ్ అండ్ పిల్గ్రిమేజ్ టూర్" ప్యాకేజీని ప్రారంభించింది.

ఈ ప్యాకేజీ ద్వారా హైదరాబాద్ నుంచి బయలుదేరిన పర్యాటకులు ముందుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుని, అనంతరం యాదాద్రిలోని శిల్పారామాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి దక్షిణ భారతదేశంలోని ప్రాచీన జైన ఆలయాల్లో ఒకటైన కొలనుపాక జైన దేవాలయానికి తీసుకెళ్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం స్వర్ణగిరి దేవాలయం, చివరిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్ చేనేత గ్రామాన్ని సందర్శించేలా టూర్‌ను రూపొందించారు.

ఈ ఒకరోజు పర్యటన హైదరాబాద్‌లోని యాత్రి నివాస్ (సికింద్రాబాద్), పర్యాటక భవన్ (బేగంపేట్), సీఆర్డీఓ కార్యాలయం (బషీర్‌బాగ్) నుంచి ఉదయం ప్రారంభమై, సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ప్రయాణంలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, హై-టీ వంటి సదుపాయాలను కూడా టూరిజం శాఖ కల్పిస్తోంది.

ఈ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.2,070, పిల్లలకు రూ.1,770 గా నిర్ణయించారు. యాదాద్రికి వచ్చే భక్తులు ఇప్పుడు ఒకే రోజులో ఆధ్యాత్మిక అనుభూతితో పాటు తెలంగాణ సంస్కృతి, వారసత్వం, చేనేత కళలను కూడా ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.

ప్యాకేజీ బుకింగ్‌లు, పూర్తి వివరాల కోసం బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయాన్ని లేదా తెలంగాణ టూరిజం అధికారిక వేదికలను సంప్రదించవచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User