రాయలసీమలో మరో బంగారు గని.. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు పసిడి నిక్షేపాల అన్వేషణ

Jun 30, 2026 - 12:02
0 3
రాయలసీమలో మరో బంగారు గని.. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు  పసిడి నిక్షేపాల అన్వేషణ

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం నిక్షేపాల అన్వేషణకు కొత్త ఊపు లభిస్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరి, చిత్తూరు జిల్లా కుప్పంలో బంగారం గనులు గుర్తించిన ప్రభుత్వం.. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలం జౌకల ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో ఉన్న ఆరు బ్లాకుల్లో బంగారం నిక్షేపాలపై సమగ్ర పరిశోధనలు చేపట్టేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.

ప్రభుత్వం నియమించిన ఆరు ప్రైవేట్ అన్వేషణ సంస్థలు జౌకల ప్రాంతంలోని సుమారు 5,560 హెక్టార్ల విస్తీర్ణంలో నాలుగు దశల్లో ఖనిజ అన్వేషణ నిర్వహించనున్నాయి. పరిశోధనలు పూర్తయిన అనంతరం నివేదికలను పరిశీలించి, వాణిజ్యపరంగా తవ్వకాలు చేపట్టే అవకాశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

వాస్తవానికి 2015లోనే ఈ ప్రాంతంలో మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్ (MERIT) ప్రాథమిక అధ్యయనాలు నిర్వహించింది. జౌకల ప్రాంతం కర్ణాటకలోని ప్రసిద్ధ కోలార్ గ్రీన్‌స్టోన్ బెల్ట్‌తో భౌగోళికంగా పోలికలు కలిగి ఉందని, బంగారం నిక్షేపాలకు అనుకూల లక్షణాలు ఉన్నాయని అప్పట్లో గుర్తించారు. అయితే 2022లో జీ-4 దశలో పరిశోధనలు నిలిచిపోవడంతో ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు అదే దశ నుంచి మళ్లీ అన్వేషణ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

జౌకల మాత్రమే కాకుండా శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి, రొద్దం ప్రాంతాల్లో కూడా బంగారం నిక్షేపాల అవకాశాలు ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి స్థాయి పరిశోధనల అనంతరం గనులను వేలం ద్వారా ప్రైవేట్ సంస్థలకు కేటాయించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇక రాయలసీమలో ఇప్పటికే కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. అక్కడ జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తవ్వకాలు నిర్వహిస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం చిగురుగుంట–బిసానత్తం బ్లాక్‌లో కూడా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతం కర్ణాటకలోని ప్రసిద్ధ కేజీఎఫ్ బంగారు గనులకు కేవలం 27 కిలోమీటర్ల దూరంలో ఉండటం విశేషం. గతంలో టెండర్లు రద్దు అయినప్పటికీ, త్వరలో మళ్లీ టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

మొత్తంగా చూస్తే కర్నూలు, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో బంగారం నిక్షేపాల అన్వేషణ వేగవంతం కావడం వల్ల రాయలసీమ ఖనిజ రంగంలో కీలక కేంద్రంగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తుది పరిశోధన నివేదికలు వెలువడిన తర్వాతే ఈ ప్రాంతాల్లో వాణిజ్యపరమైన బంగారం తవ్వకాలపై స్పష్టత రానుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User