రుషికొండ భవనాలపై ఎట్టకేలకు క్లారిటీ..
విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల భవిష్యత్ వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ఈ భవనాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీయగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ ప్రకారం రుషికొండ భవనాలను ప్రభుత్వ కార్యాలయాలు లేదా అధికారుల నివాసాలుగా కాకుండా, ప్రపంచ స్థాయి హోటల్, రిసార్ట్, హాస్పిటాలిటీ మరియు టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.లీజ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) విధానంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించారు. ఇప్పటికే నిర్మించిన ఐదు భవనాల నిర్వహణ, మార్కెటింగ్, వాణిజ్య వినియోగంతో పాటు అవసరమైన చోట అదనపు అభివృద్ధికి కూడా అవకాశం కల్పించనున్నారు.
ప్రస్తుతం ఉన్న సుమారు 9.8 ఎకరాల హిల్‌టాప్ ప్రాంతంతో పాటు, దిగువన ఉన్న మరో 9 ఎకరాల భూమిని కూడా టూరిజం అభివృద్ధిలో భాగం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. భవిష్యత్తులో అక్కడ హోటళ్లు, రిసార్టులు, పర్యాటక సదుపాయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే అన్ని నిర్మాణాలు సీఆర్‌జెడ్ (CRZ) నిబంధనలు, చట్టబద్ధ అనుమతులకు లోబడి మాత్రమే చేపట్టనున్నట్లు EOIలో పేర్కొన్నారు.
ప్రజలకు కూడా ఈ ప్రాజెక్టులో ప్రాధాన్యం కల్పించనున్నారు. వ్యూయింగ్ పాయింట్లు, ప్రొమెనేడ్లు, ఓపెన్ స్పేస్‌లు, కల్చరల్ జోన్‌లు వంటి ప్రజలకు అందుబాటులో ఉండే సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో రుషికొండ భవనాలు పూర్తిగా ప్రైవేట్ ప్రాజెక్టుగా కాకుండా, ప్రజలు సందర్శించగల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనున్నాయి.అదనంగా, రెండు ఖాళీ స్థలాల్లో సుమారు 4,800 చదరపు మీటర్ల వరకు కొత్త నిర్మాణాలకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. వీటిలో పర్యాటక అవసరాలకు అనుగుణంగా కొత్త సదుపాయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
మంత్రుల కమిటీ పరిశీలనలు, ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు, తాజాగా విడుదలైన EOI ఆధారంగా చూస్తే రుషికొండ భవనాలను ప్రపంచ స్థాయి టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్ది, ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా వినియోగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేబినెట్ ఆమోదం అనంతరం RFP ప్రక్రియ పూర్తైతే ఈ ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమం కానుంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)