కోహ్లీ ఐపీఎల్ రిటైర్మెంట్‌ ?కీలక వ్యాఖ్యలు చేసిన సీఈవో రాజేశ్ మీనన్

Jun 20, 2026 - 16:39
0 2
కోహ్లీ ఐపీఎల్ రిటైర్మెంట్‌ ?కీలక వ్యాఖ్యలు చేసిన సీఈవో రాజేశ్ మీనన్

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే గుర్తొచ్చే మొదటి పేరు విరాట్ కోహ్లీ. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ఆర్సీబీ జెర్సీలో అభిమానులను అలరిస్తున్న కోహ్లీ భవిష్యత్తుపై ఆర్సీబీ సీఈవో రాజేశ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విరాట్ కోహ్లీ, ఆర్సీబీ ఒకే నాణేనికి రెండు వైపులని పేర్కొన్న రాజేశ్ మీనన్.. కోహ్లీ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా అతడు ఎప్పటికీ ఆర్సీబీ కుటుంబంలో భాగమేనని స్పష్టం చేశారు. కోహ్లీ ఫిట్‌నెస్, ఆటపట్ల అంకితభావాన్ని చూస్తుంటే అతడు మరో మూడు నుంచి నాలుగేళ్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగగలడనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అభిమానులను కలిగిన జట్లలో ఆర్సీబీ ఒకటి. 2008 నుంచి ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ.. జట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. 2025లో తొలి ఐపీఎల్ టైటిల్ సాధించిన ఆర్సీబీ.. 2026లో కూడా విజేతగా నిలిచి బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలను కైవసం చేసుకుంది. ఈ విజయాల్లో కోహ్లీ పాత్ర ఎంతో కీలకమైంది.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ అద్భుత ఫామ్ ప్రదర్శించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 675 పరుగులు సాధించి జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించి, విన్నింగ్ షాట్‌తో ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ అందించాడు.

ప్రస్తుతం 37 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న అతడు, 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే కోహ్లీ ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ఆటపై అతని నిబద్ధతను దృష్టిలో ఉంచుకుంటే మరో మూడు నుంచి నాలుగేళ్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగడం పెద్ద విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆర్సీబీ అభిమానులకు రాజేశ్ మీనన్ వ్యాఖ్యలు మరింత ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User