ప్రియుడి మోజులో రెండేళ్ల కొడుకును నేలకేసి కొట్టి..

Jun 20, 2026 - 17:02
0 3
 ప్రియుడి మోజులో రెండేళ్ల కొడుకును నేలకేసి కొట్టి..

మేడ్చల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ తల్లి తన రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో గడుపుతుండగా బాలుడు ఏడవడంతో చిరాకు చెందిన ప్రియుడు.. చిన్నారిని చంపేయాలని సూచించగా, తల్లి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి, జ్యోతి దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి మేడ్చల్ జిల్లా కీసరలో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. స్వామి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, జ్యోతి ఇంటి వద్దే పిల్లలను చూసుకుంటూ ఉండేది.

అయితే జ్యోతికి పెళ్లికి ముందే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది ప్రేమ సంబంధంగా మారింది. వివాహం అనంతరం కూడా ఇద్దరి మధ్య సంబంధం కొనసాగినట్లు దర్యాప్తులో తేలింది.

గత మే 29న స్వామి విధులకు వెళ్లిన సమయంలో నవీన్ ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఉండగా రెండేళ్ల బాలుడు ఏడవడం ప్రారంభించాడు. చిన్నారి ఏడుపుతో తమ ఏకాంతానికి భంగం కలుగుతోందని ఆగ్రహించిన నవీన్, బాలుడిని చంపేయాలని జ్యోతికి సూచించినట్లు సమాచారం. అనంతరం జ్యోతి చిన్నారిని నేలకేసి కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఘటన అనంతరం భర్త ఇంటికి వచ్చినప్పుడు, బాలుడు ఫిట్స్ రావడంతో మృతి చెందాడని జ్యోతి నమ్మించే ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులు కూడా అదే నిజమని భావించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అనంతరం జ్యోతి ప్రవర్తనలో మార్పులు గమనించిన భర్త స్వామికి అనుమానం కలిగింది.

భార్యను పలుమార్లు ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం రాకపోవడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒత్తిడికి లోనైన జ్యోతి, చిన్నారిని తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆమె వివాహేతర సంబంధం విషయం కూడా బయటపడింది.

భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. నిందితురాలు జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు, మానవ సంబంధాలు ఎంత దారుణ స్థితికి చేరుతున్నాయో ప్రతిబింబిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User