చరిత్ర సృష్టించిన షర్మిల ధన్‌ఖడ్.. భారత్‌కు తొలి పారా అథ్లెటిక్స్ స్వర్ణం
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్ షర్మిల ధన్‌ఖడ్ చరిత్ర సృష్టించారు. మహిళల షాట్‌పుట్ F57 విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆమె 9.81 మీటర్ల దూరం బరువును విసిరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణిగా నిలిచారు.
స్కాట్స్టౌన్ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోటీలో షర్మిల తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. పోటీ అంతా నిలకడగా రాణించిన ఆమె చివరకు అగ్రస్థానంలో నిలిచి భారత జెండాను రెపరెపలాడించారు. ఈ విజయంతో పారా అథ్లెటిక్స్‌లో భారత్ ఎదురుచూస్తున్న రెండు దశాబ్దాల స్వర్ణ కల సాకారమైంది.
ఈ విభాగంలో మరో భారత అథ్లెట్ శిల్పా కే శైలా కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచారు. 7.26 మీటర్ల త్రోతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని భారత్‌కు మరో పతకాన్ని అందించారు. ఒకే ఈవెంట్లో ఇద్దరు భారత క్రీడాకారిణులు పతకాలు సాధించడం భారత జట్టుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఇంతకుముందు మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించి భారత్‌కు తొలి పసిడిని అందించారు. వరుసగా మూడో కామన్వెల్త్ స్వర్ణాన్ని గెలుచుకున్న ఆమె తర్వాత షర్మిల విజయం భారత క్రీడా దళానికి మరో గొప్ప మైలురాయిగా నిలిచింది.

ఇప్పటివరకు ముగిసిన పోటీల అనంతరం భారత్ మొత్తం 10 పతకాలతో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. భారత ఖాతాలో ప్రస్తుతం 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. బాక్సింగ్, అథ్లెటిక్స్‌తో పాటు మరికొన్ని విభాగాల్లో భారత క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్‌కు చేరుకోవడంతో రాబోయే రోజుల్లో పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐదో రోజు మాత్రమే భారత జట్టు మొత్తం ఆరు పతకాలు సాధించడం విశేషం. ఒక స్వర్ణం, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో భారత అథ్లెట్లు తమ సత్తాను మరోసారి నిరూపించారు.
ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాలు
స్వర్ణ పతకాలు
మీరాబాయి చాను – వెయిట్‌లిఫ్టింగ్ (మహిళల 48 కేజీలు)
షర్మిల ధన్‌ఖడ్ – పారా అథ్లెటిక్స్ (మహిళల షాట్‌పుట్ F57)
రజత పతకాలు
రిషికాంత్ సింగ్ – వెయిట్‌లిఫ్టింగ్ (పురుషుల 60 కేజీలు)
ముత్తుపాండి రాజా – వెయిట్‌లిఫ్టింగ్ (పురుషుల 65 కేజీలు)
జ్ఞానేశ్వరి యాదవ్ – వెయిట్‌లిఫ్టింగ్ (మహిళల 53 కేజీలు)
వల్లూరి అజయ్ బాబు – వెయిట్‌లిఫ్టింగ్ (పురుషుల 79 కేజీలు)
సర్వేశ్ కుషారే – అథ్లెటిక్స్ (పురుషుల హైజంప్)
కాంస్య పతకాలు
ఝండు కుమార్ – పారా పవర్‌లిఫ్టింగ్ (పురుషుల హెవీవెయిట్)
బింద్యారాణి దేవి – వెయిట్‌లిఫ్టింగ్ (మహిళల 58 కేజీలు)
శిల్పా కే శైలా – పారా అథ్లెటిక్స్ (మహిళల షాట్‌పుట్ F57)
షర్మిల ధన్‌ఖడ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం భారత పారా అథ్లెటిక్స్‌కు కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై భారత క్రీడాకారుల ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)