తిరుపతిలో ఘనంగా శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం
తిరుపతి: సకల సంపదలకు అధిష్ఠాన దేవతగా కొలువుదీరిన శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తూ నిర్వహించిన శ్రీ మహాలక్ష్మీ దీప పూజ కార్యక్రమం తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో, ఎస్వీబీసీ నిర్వహణలో శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు.
వేలాది దీపాల వెలుగులతో పుష్కరిణి ప్రాంగణం దివ్య కాంతులతో కళకళలాడగా, గోవింద నామస్మరణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు, వేద మంత్రోచ్చారణలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి దీపాలను వెలిగించి సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో జీవించాలని సంకల్పించి టీటీడీ పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్నిపెంపొందించడంలో శ్రీ మహాలక్ష్మీ దీప పూజ విశేష పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఇకపై ప్రతి నెల రెండో శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దీపం వెలిగే చోట శుభం, ఐశ్వర్యం నెలకొంటాయని తెలిపారు. భక్తుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు.

అర్చకులు శాస్త్రోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దీపలక్ష్మీ ఆరాధన, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించగా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీపాల వెలుగులు, గోవింద నామస్మరణలు, భక్తి గీతాల మధ్య సాగిన ఈ మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది.
సంపదలకు ప్రతీకగా భావించే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిర్వహించిన ఈ దీపోత్సవంలో పాల్గొన్న భక్తులు తమ కుటుంబాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ప్రార్థించారు. వేలాది దీపాల కాంతులతో ప్రకాశించిన శ్రీ రామచంద్ర పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)