రికార్డు స్థాయిలో బాసర సరస్వతీ హుండీ ఆదాయం..
నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆలయ హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. మే 13 నుంచి జూలై 1 వరకు కేవలం 49 రోజుల వ్యవధిలోనే హుండీ ద్వారా రూ.1,06,45,359 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనా దేవి వెల్లడించారు.
హుండీ లెక్కింపులో నగదుతో పాటు 78 గ్రాముల మిశ్రమ బంగారం, సుమారు 4 కిలోల వెండి వస్తువులు కూడా లభించాయి. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన 17 విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో గుర్తించారు.
ఆలయ నిబంధనల ప్రకారం సీసీ కెమెరాల పర్యవేక్షణ, కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీ లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు, స్థానిక పోలీసులు, వాగ్దేవి సొసైటీ సభ్యులు, శ్రీ రాజరాజేశ్వర స్వామి సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రావణ మాసం, దేవీ నవరాత్రుల వంటి పండుగల నేపథ్యంలో బాసర ఆలయానికి భక్తుల రాక మరింత పెరిగే అవకాశముందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో హుండీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)