ఫ్రీ ఫైర్ మాయలో మైనర్లు.. హైదరాబాద్ నుంచి బీహార్‌కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు..

Jun 25, 2026 - 12:45
0 2
ఫ్రీ ఫైర్ మాయలో మైనర్లు.. హైదరాబాద్ నుంచి బీహార్‌కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు..

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో హైదరాబాద్‌లో చోటుచేసుకున్న తాజా ఘటన మరోసారి నిరూపించింది. ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా పరిచయమైన అపరిచితుల మాయమాటలు నమ్మిన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఇల్లు వదిలి బీహార్‌ వెళ్లేందుకు బయల్దేరగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సకాలంలో స్పందించి వారిని సురక్షితంగా రక్షించారు.

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్థానిక పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్నారు. లాక్‌డౌన్ కాలం నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటు పడిన వీరు కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లలో ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ ఆడటం ప్రారంభించారు.

గేమ్ ఆడే క్రమంలో బీహార్‌కు చెందిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. రోజురోజుకూ ఆ పరిచయం మరింత పెరిగి గంటల తరబడి చాటింగ్ చేయడం, ఫోన్‌లో మాట్లాడటం వరకు వెళ్లింది. ఇంట్లో తల్లి గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నందుకు మందలిస్తోందని బాలికలు ఆ వ్యక్తులతో పంచుకున్నారు.

దీన్ని అవకాశంగా మార్చుకున్న ఆన్‌లైన్ కేటుగాళ్లు.. "ఇక్కడికి వచ్చేయండి.. మా దగ్గర చాలా ఫోన్లు ఉన్నాయి.. రోజంతా ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చు" అంటూ బాలికలను ప్రలోభపెట్టారు. జూన్ 22న తల్లి మరోసారి మందలించడంతో మనస్తాపానికి గురైన ముగ్గురు బాలికలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని బీహార్‌ వెళ్లే రైలు ఎక్కారు.

సాయంత్రం అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలికలు ఉపయోగించిన మొబైల్ ఫోన్, ఫ్రీ ఫైర్ గేమ్ ఐడీ, సోషల్ మీడియా వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

గేమ్ ఐడీ ద్వారా నగరానికి చెందిన ఓ బాలుడిని గుర్తించి విచారించగా.. బాలికలు బీహార్‌ వెళ్తున్నట్లు కీలక సమాచారం లభించింది. ఇదే సమయంలో రైలు ప్రయాణంలో ఒక ప్రయాణికుడి మొబైల్ తీసుకుని బాలికలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బీహార్‌లోని అపరిచితులకు మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

సాంకేతిక ఆధారాలు, ఐపీ అడ్రస్‌లు, మొబైల్ లొకేషన్‌లను విశ్లేషించిన పోలీసులు బాలికలు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్లు నిర్ధారించారు. వెంటనే రైల్వే పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పోలీసులను అప్రమత్తం చేశారు.

రైలు ఏలూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే పోలీసులు రైలును తనిఖీ చేసి ముగ్గురు బాలికలను గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సైబర్ ముఠా చేతుల్లో పడకముందే బాలికలను రక్షించిన పోలీసుల చాకచక్యాన్ని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటన ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా పరిచయాల విషయంలో పిల్లలపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User