చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఘాటు ట్వీట్

Jul 01, 2026 - 16:07
0 2
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఘాటు ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టుల అరెస్టులపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ప్రశ్న రావణ్, కేవీఆర్‌లను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్‌లో ప్రకాష్ రాజ్.. అధికార దుర్వినియోగం ద్వారా ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరైన విధానం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు, ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే గానీ, అరెస్టులతో స్పందించడం పిరికితనమని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రంలో జరిగినా అన్యాయం అన్యాయమేనని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, జర్నలిస్ట్, యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్‌లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లు, ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కేవీఆర్‌ను విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేవీఆర్‌ను సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు తీసుకెళ్లారని, ఇది కిడ్నాప్‌లా జరిగిందంటూ ఆయన భార్య హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అదే సభలో చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌పైనా కేసు నమోదైంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User