వైభవంగా ముగిసిన తిరుమల జ్యేష్ఠాభిషేకం..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన సాలకట్ల జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మహోత్సవాల చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణ కవచంలో అలంకరించబడి భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.
ఇక వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేక మహోత్సవం వరకు శ్రీ మలయప్పస్వామివారు, ఉభయ దేవేరులు ఇదే స్వర్ణ కవచంలో వివిధ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

చివరి రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయ నాంచారులతో కలిసి సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. తర్వాత స్వామివారికి, ఉభయ దేవేరులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు సమర్పించారు.
సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో స్వర్ణ కవచంలో దివ్యంగా అలంకరించబడిన శ్రీ మలయప్పస్వామివారు, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ వేలాది మంది భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.
ఈ మహోత్సవాల్లో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)