"స్పిరిట్" చుట్టూ కొత్త వివాదం.. ప్రభాసే న్యాయం చేయాలంటున్న మహిళా రైతు

Jun 22, 2026 - 13:30
0 2
"స్పిరిట్" చుట్టూ కొత్త వివాదం.. ప్రభాసే న్యాయం చేయాలంటున్న మహిళా రైతు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం "స్పిరిట్" ఇప్పుడు టైటిల్ వివాదంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో "స్పిరిట్ ఈజ్ నాట్ వన్" అనే టైటిల్‌తో సినిమా నిర్మించిన మహిళా రైతు నిర్మాత నరసమ్మ చేసిన ఆరోపణలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి.

నరసమ్మ మీడియా ముందుకు వచ్చి కన్నీటి ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలు అమ్మి, తన ఆస్తులు తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించామని ఆమె తెలిపారు. ఎన్నో ఏళ్ల శ్రమతో పూర్తి చేసిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సమయంలో అకస్మాత్తుగా టీ-సిరీస్ తరపున లీగల్ నోటీసులు రావడంతో రిలీజ్ ఆగిపోయిందని ఆమె ఆరోపించారు.

తమ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని, గత కొన్నేళ్లుగా వివిధ మీడియా వేదికల ద్వారా ప్రమోషన్స్ కూడా నిర్వహించామని నరసమ్మ చెప్పారు. టైటిల్ విషయంలో ముందుగానే తమను సంప్రదించి ఉంటే సమస్యను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉండేదని, ప్రభాస్‌పై అభిమానంతో టైటిల్ మార్చుకోవడానికి కూడా తాము సిద్ధంగా ఉండేవాళ్లమని ఆమె స్పష్టం చేశారు.

లీగల్ నోటీసుల కారణంగా డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గారని, సినిమా విడుదల కోసం ముందుకొచ్చిన ఆర్థిక సహాయకులు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గడంతో తమ కుటుంబం తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సినిమా భవిష్యత్తు అనిశ్చితంగా మారిందని తెలిపారు.

ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని నరసమ్మ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న నిర్మాతలను పెద్ద నిర్మాణ సంస్థలు ఇబ్బంది పెట్టకూడదని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.

అయితే, ఈ వివాదంపై ఇప్పటివరకు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా లేదా టీ-సిరీస్ సంస్థ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. దీంతో ఈ వ్యవహారం ఎటువంటి మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User