అమరావతిలో రూ.150 కోట్లతో ప్రపంచ స్థాయి సెంట్రల్ లైబ్రరీ.. ఈ నెలలోనే శంకుస్థాపన

Jul 02, 2026 - 15:18
Updated: 9 days ago
0 2
అమరావతిలో రూ.150 కోట్లతో ప్రపంచ స్థాయి సెంట్రల్ లైబ్రరీ.. ఈ నెలలోనే శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఈ నెలలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నారు.ఈ ప్రాజెక్టు కోసం సీఆర్డీఏ 19.60 ఎకరాల భూమిని కేటాయించింది. లైబ్రరీతో పాటు తెలుగు సాంస్కృతిక కేంద్రం, మానవ వనరుల అభివృద్ధి సంస్థ భవనాలను కూడా ఇదే ప్రాంగణంలో నిర్మించనున్నారు.లైబ్రరీ నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ.100 కోట్లను దుబాయ్‌కు చెందిన శోభా గ్రూప్ సమకూర్చనుండగా, మిగిలిన రూ.50 కోట్లను దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా సమీకరించనున్నారు. అవసరమైతే అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రెండేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రపంచ స్థాయి సౌకర్యాలు

అమరావతి సెంట్రల్ లైబ్రరీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా భవన నిర్మాణం చేపట్టనున్నారు.జీ+5 నమూనాలో నిర్మించనున్న ఈ లైబ్రరీలో 10 లక్షలకుపైగా పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఒకేసారి 2,500 మంది కూర్చునే సామర్థ్యం కల్పించనుండగా, ఇది దేశంలోనే అత్యధిక సీటింగ్ కెపాసిటీ కలిగిన లైబ్రరీలలో ఒకటిగా నిలవనుంది.

విద్యార్థులు, పరిశోధకులకు ప్రత్యేక వేదిక

పిల్లలు, విద్యార్థులు, పరిశోధకులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ లైబ్రరీ, ఈ-లైబ్రరీ సేవలు, అరుదైన పుస్తకాల భద్రపరిచే ప్రత్యేక విభాగాలు కూడా అందుబాటులో ఉంటాయి.అలాగే ఆడిటోరియం, కాన్ఫరెన్స్ హాల్స్, సెమినార్ హాల్స్, బుక్ ఎగ్జిబిషన్ల కోసం ప్రత్యేక గ్యాలరీలను నిర్మించనున్నారు.

ప్రత్యేక ఆకర్షణలు

ఈ భవనంలో 108 స్తంభాలను బౌద్ధ స్తూపాల శైలిలో, అంతర్గత మెట్ల నిర్మాణాన్ని ఉండవల్లి గుహల నమూనాలో రూపొందించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ నిర్మాణం ఉండనుంది.

అమరావతిలో మరో భారీ పెట్టుబడి

ఇదిలా ఉండగా, అమరావతిలో రూ.210 కోట్ల పెట్టుబడితో ఫైవ్ స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్  నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. వరుణ్ హాస్పిటాలిటీ కన్సార్షియం ఆధ్వర్యంలో అకోర్ బ్రాండ్ పేరుతో 6.5 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. స్టాంప్ డ్యూటీ, భూమి లీజు, విద్యుత్ టారిఫ్‌లు, ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు తదితర అంశాల్లో ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది.ఈ రెండు ప్రాజెక్టులు అమరావతిని విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని అధికారులు భావిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User