ఆంధ్రా అబ్బాయి – జర్మనీ అమ్మాయి .. నరసరావుపేటలో ఘనంగా పెళ్లి

Jun 20, 2026 - 15:50
0 2
ఆంధ్రా అబ్బాయి – జర్మనీ అమ్మాయి .. నరసరావుపేటలో ఘనంగా పెళ్లి

ప్రేమకు దేశాల సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది .ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు, జర్మనీలో స్థిరపడిన యువతి ప్రేమకథ అందుకు మళ్ళీ సాక్ష్యంగా నిలిచింది . పల్నాడు జిల్లాకు చెందిన యాంపాటి వెంకటేశ్వర్లు, జర్మనీలో పరిచయమైన పలీనా అనే యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరానికి చెందిన యాంపాటి శ్రీనివాసరావు, బంగారమ్మల కుమారుడు వెంకటేశ్వర్లు ఉన్నత విద్య కోసం కొన్నేళ్ల క్రితం జర్మనీకి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న సమయంలో పలీనా అనే యువతితో పరిచయం ఏర్పడింది. రష్యాకు చెందిన పలీనా తన కుటుంబంతో కలిసి జర్మనీలో స్థిరపడగా, ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుకోవడంతో స్నేహం ప్రేమగా మారింది.

చదువు పూర్తయ్యాక వెంకటేశ్వర్లు ప్రముఖ టెక్నాలజీ సంస్థలో ఉద్యోగంలో చేరగా, పలీనా కూడా తన కెరీర్‌ను కొనసాగించారు. అనంతరం తమ ప్రేమను వివాహంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు.

శుక్రవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్ హాల్‌లో వెంకటేశ్వర్లు–పలీనా వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జర్మనీ, రష్యా దేశాల నుంచి వధువు బంధువులు ప్రత్యేకంగా హాజరయ్యారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం నిర్వహించిన ఈ వివాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విదేశాల నుంచి వచ్చిన అతిథులకు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో ఆతిథ్యం అందించగా, వారు ఆ రుచులను ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. రెండు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుక సందడిగా సాగింది.

ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత విదేశాల్లో చదువులు, ఉద్యోగాల నిమిత్తం వెళ్లి అక్కడి యువతతో ప్రేమలో పడి వివాహాలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ విదేశీయులు తెలుగు కుటుంబాల్లో కలిసిపోవడం, స్థానిక ఆచారాలను పాటిస్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టడం విశేషంగా మారుతోంది.

ప్రేమకు భాష, దేశం, మతం, జాతి అనే భేదాలు లేవని ఈ జంట మరోసారి చాటిచెప్పింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User