అష్టదళ పాద పద్మారాధన సేవ వెనుక ఓ ముస్లిం భక్తుడు.. 108 బంగారు తామరపూలతో శ్రీనివాసుడికి అపూర్వ కానుక
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి శుక్రవారం అత్యంత వైభవంగా జరిగే అష్టదళ పాద పద్మారాధన సేవ వెనుక ఒక అద్భుతమైన భక్తి గాథ దాగి ఉంది. ఈ సేవకు కారణమైన వ్యక్తి హిందువు కాదు... గుంటూరు జిల్లాకు చెందిన ఓ ముస్లిం భక్తుడు. ఆయన పేరు షేక్ మస్తాన్. భగవంతుడి ముందు మతాలకు అతీతంగా నిలిచే భక్తి ఎంత గొప్పదో ఈ సంఘటన నేటికీ చాటి చెబుతోంది.
టీటీడీ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా శ్రీవారి ఆలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఒక కొత్త సేవను ప్రారంభించాలని అప్పటి టీటీడీ ఈఓ పీవీఆర్‌కే ప్రసాద్ సంకల్పించారు. పెద్దలు, ఆగమ సలహాదారులు, అధికారులు కలిసి అనేక సమావేశాలు నిర్వహించినప్పటికీ అందరికీ ఆమోదయోగ్యమైన సేవపై నిర్ణయం తీసుకోలేకపోయారు.అలాంటి సమయంలో గుంటూరు నుంచి వచ్చిన ఓ సాధారణ భక్తుడు ఈఓను అత్యవసరంగా కలవాలని కోరాడు. సమావేశంలోకి వచ్చిన ఆయన తన పేరు షేక్ మస్తాన్ అని పరిచయం చేసుకుని, తమ కుటుంబం మూడు తరాలుగా శ్రీ వేంకటేశ్వరస్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తోందని వివరించాడు.ప్రతిరోజూ సుప్రభాతం, ప్రపత్తి, మంగళాశాసనం పఠించడం తమ ఇంటి సంప్రదాయమని, ప్రతి మంగళవారం 108 నామాలతో స్వామివారికి పూలతో అర్చన చేయడం తమ కుటుంబ ఆనవాయితీ అని చెప్పాడు. అనంతరం తమ తాత మొక్కిన మొక్కు గురించి వివరించాడు .

శ్రీవారికి 108 బంగారు తామరపూలను సమర్పించాలని తమ తాత మొక్కుకున్నారని, ఆ కోరికను ఆయన నెరవేర్చలేకపోయారని, తర్వాత తన తండ్రి కూడా ఆ బాధ్యతను పూర్తి చేయకుండానే మరణించారని చెప్పాడు. చివరకు ఆ బాధ్యత తనపై పడిందని, ఎన్నో కష్టాలు పడి రూపాయి రూపాయి కూడబెట్టి 108 బంగారు తామరపూలను తయారు చేయించానని తెలిపాడు.తమ కుటుంబానికి చెందిన 54 మంది సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు వచ్చి, ఈ బంగారు తామరపూలను ఎప్పుడో ఒకప్పుడు శ్రీవారి సేవలో వినియోగిస్తే తమ మూడు తరాల మొక్కు నెరవేరినట్లేనని వినయంగా కోరుతూ ఆ తామరపూలను ఈఓ ముందు ఉంచాడు.
ఆ భక్తి చూసి సమావేశ మందిరంలో ఉన్న వారందరూ భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి టీటీడీ ఈఓ పీవీఆర్‌కే ప్రసాద్ స్వయంగా షేక్ మస్తాన్ చేతులు పట్టుకుని, ఇంతటి మహాభక్తుడిని చూడడం తమ అదృష్టమని అభినందించినట్లు చెబుతారు. ప్రభుత్వ నిబంధనల కారణంగా వెంటనే సేవలో వినియోగిస్తామని హామీ ఇవ్వలేనప్పటికీ, శ్రీవారి సేవలో తప్పకుండా స్థానం కల్పిస్తామని మాట ఇచ్చారు.
కొద్ది రోజుల తర్వాత టీటీడీ బోర్డు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వారానికి ఒకసారి నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను ప్రారంభించి, షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించిన 108 బంగారు తామరపూలతోనే ఆ సేవను నిర్వహించాలని నిర్ణయించింది.అప్పటి నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ సేవ నిరాటంకంగా కొనసాగుతోంది. నేటికీ ఆ బంగారు తామరపూలతో స్వామివారి పాదాలకు అర్చన నిర్వహించడం ఈ సేవ ప్రత్యేకతగా నిలిచింది.
ఈ సంఘటన ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భగవంతుడి దృష్టిలో మతం కాదు... మనస్ఫూర్తిగా సమర్పించే భక్తే గొప్పది. శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రతి భక్తుడూ సమానుడే. అందుకే ఈ గాథ తిరుమల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)