‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్-2026’..నారా బ్రాహ్మణి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ప్రముఖ వ్యాపార పత్రిక ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్-2026’జాబితాలో ఆమె స్థానం సంపాదించారు.ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నారా బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో విశేషంగా కృషి చేస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలకు ఫార్చ్యూన్ ఇండియా ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తుంది.
రైతులకు, హెరిటేజ్ ఫ్యామిలీకి అంకితం
అవార్డు స్వీకరించిన అనంతరం బ్రాహ్మణి మాట్లాడుతూ, హెరిటేజ్ ఫుడ్స్ విజయ ప్రయాణంలో రైతుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. రైతుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.తనకు లభించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డును రైతులకు, హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబ సభ్యులందరికీ అంకితం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
చంద్రబాబు అభినందనలు
నారా బ్రాహ్మణికి ఈ గౌరవం దక్కడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్-2026’జాబితాలో చోటు దక్కడం ఆమె నాయకత్వం, దూరదృష్టి, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. ఈ గుర్తింపు యువతకు, ముఖ్యంగా తెలుగు యువతులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధిస్తూ కొత్త మైలురాళ్లు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
లోకేష్, భువనేశ్వరి శుభాకాంక్షలు
మంత్రి నారా లోకేష్ కూడా బ్రాహ్మణికి అభినందనలు తెలిపారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలను మరింత చాటుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.నారా భువనేశ్వరి కూడా బ్రాహ్మణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అవార్డు ఆమె దూరదృష్టి, దృఢ సంకల్పం, సమర్థ నాయకత్వానికి నిదర్శనమని పేర్కొంటూ ఈ గొప్ప విజయానికి అభినందనలు తెలిపారు.
వ్యాపార రంగంలో మరో మైలురాయి
హెరిటేజ్ ఫుడ్స్‌లో సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న నారా బ్రాహ్మణికి ఈ అవార్డు దక్కడం వ్యాపార రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభావవంతమైన మహిళా నాయకుల్లో ఆమెకు స్థానం లభించడం తెలుగు రాష్ట్రాలకు కూడా గర్వకారణంగా నిలిచింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)