షాబాద్ హత్యల కేసులో ఉద్రిక్తత.. బాధితులను కలిసేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ నేతల అరెస్ట్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరుగురు హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
సబితా, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు దైవాలగూడ గ్రామానికి బయలుదేరిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లను శంకర్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు డిటైన్ చేశారు.మరోవైపు యువ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
పోలీసులు శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నామని చెబుతుండగా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా అడ్డుకునేందుకే ఈ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
గ్రామస్థుల ఆగ్రహం.. పోలీసులపై తీవ్ర విమర్శలు
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు రాజ్‌కుమార్ పై గతంలోనే పలు కేసులు నమోదైనా, అతడిపై కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, రాజ్‌కుమార్ గతంలో ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే కేసులో తేలికపాటి సెక్షన్లు నమోదు చేయడం వల్ల అతనికి సులభంగా బెయిల్ లభించిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
గతంలోనూ బెదిరింపులు చేసినట్లు ఆరోపణలు
గ్రామస్థుల ఆరోపణల ప్రకారం, నిందితుడు గతంలోనే బాధిత కుటుంబాన్ని బహిరంగంగా బెదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ బాధిత కుటుంబానికి తగిన భద్రత కల్పించలేదని వారు అంటున్నారు.అలాగే నిందితుడిపై గతంలో నమోదైన ఇతర కేసులను దృష్టిలో ఉంచుకుని రౌడీషీట్ తెరవాల్సి ఉన్నప్పటికీ పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కూడా విమర్శిస్తున్నారు.
దర్యాప్తు కొనసాగుతోంది
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి నేర చరిత్ర, గతంలో నమోదైన కేసుల నిర్వహణ తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి స్పందనలు కొనసాగుతుండగా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)