పవన్ కళ్యాణ్‌ భుజం సర్జరీ పూర్తి .. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో డిప్యూటీ సీఎం

Jul 11, 2026 - 13:57
0 2
పవన్ కళ్యాణ్‌ భుజం సర్జరీ పూర్తి .. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముంబైలో విజయవంతంగా భుజం శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.

డిప్యూటీ సీఎం కార్యాలయం (DCMO) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆపరేషన్‌కు సుమారు మూడున్నర గంటల సమయం పట్టింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

రెండు నెలల తర్వాత ఎడమ భుజానికి మరో సర్జరీ

వైద్యుల సూచన మేరకు రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయకుండా, దశలవారీగా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కుడి భుజానికి ఆపరేషన్ పూర్తి కాగా, సుమారు రెండు నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ నిర్వహించనున్నారు.

చంద్రబాబు ఆకాంక్ష

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు."ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ఈ సమయంలో ఆయనకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు, అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఏళ్లుగా వేధిస్తున్న భుజం గాయాలు

పవన్ కళ్యాణ్ భుజం సమస్య కొత్తది కాదు. 2016లో ఆయన భుజాలకు గాయాలు అయ్యాయి. అప్పట్లో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, ప్రజా కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు కొనసాగించారు.2018 జనసేన పోరాట యాత్ర, 2019 రాయలసీమ పర్యటనలు, అలాగే 2024 ఎన్నికల ప్రచారం, వారాహి యాత్రల సమయంలో అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా కరచాలనం చేయడం, హత్తుకోవడం వల్ల భుజాలపై మరింత ఒత్తిడి పడింది. దీంతో గాయాలు తీవ్రతరమయ్యాయని సమాచారం.

వైద్యుల సూచనతో శస్త్రచికిత్స

ఈ ఏడాది ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీలు, మజిల్ టియర్స్ తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.గత నెలలో ముంబైలో జరిగిన వైద్య పరీక్షల అనంతరం వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అయితే అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే సర్జరీ చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.వైద్యుల సలహా మేరకు రెండు భుజాలకు ఒకేసారి కాకుండా, ముందుగా కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఎడమ భుజానికి కూడా ఆపరేషన్ చేయనున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User