ఏపీకి 'గ్రేట్ గ్రీన్ వాల్'.. తీరాన్ని కాపాడే మెగా గ్రీన్ ప్లాన్

Aug 04, 2026 - 13:45
0 2
ఏపీకి 'గ్రేట్ గ్రీన్ వాల్'.. తీరాన్ని కాపాడే మెగా గ్రీన్ ప్లాన్

వాతావరణ మార్పుల ప్రభావంతో తీర ప్రాంత జిల్లాలకు పెరుగుతున్న విపత్తుల ముప్పును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 'గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' ప్రాజెక్టును అమలు చేయనుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు.

రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి ఐదు కిలోమీటర్ల వెడల్పుతో పచ్చదనపు గోడను ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న తుఫాన్లు, వరదలు, తీర కోత వంటి సమస్యల నుంచి తీర ప్రాంతాలను రక్షించడంలో ఈ గ్రీన్ వాల్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు పురోగతిపై అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్, రానున్న రెండు నెలల్లో పనులు వేగవంతం చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గత రెండేళ్లలో మడ అడవుల అభివృద్ధిలో సాధించిన పురోగతికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, దేశంలో రెండో స్థానానికి చేరుకోవడంలో కృషి చేసిన అధికారులను అభినందించారు.

ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ, అలాగే 5,000 హెక్టార్లలో తాటి వనాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మొక్కల సేకరణ, నాటే కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు.

కాలువ గట్లు, చెరువులు, తీర ప్రాంతాల్లో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాటి వనాలు, సామాజిక వనాల ప్రాధాన్యంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

వాతావరణ మార్పుల నేపథ్యంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు పెరుగుతున్నాయని, భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించాలంటే ఇలాంటి భారీ హరిత ప్రాజెక్టులు అత్యవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User