ఏపీలో కుంకుమ పువ్వు సాగుకు శ్రీకారం.. చింతపల్లిలో 30 ఎకరాల్లో భారీ ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత విలువైన సుగంధ ద్రవ్యమైన కుంకుమ పువ్వు (సాఫ్రాన్) సాగును రాష్ట్రంలో ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది. రెండేళ్లుగా నిర్వహించిన ప్రయోగాలు విజయవంతం కావడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 30 ఎకరాల్లో కుంకుమ పువ్వు సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొదట లంబసింగి ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ అనువైన భూమి అందుబాటులో లేకపోవడంతో చింతపల్లిని ఎంపిక చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించిన శాస్త్రీయ ప్రయోగాలు ఆశాజనక ఫలితాలు ఇవ్వడంతో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ ప్రాజెక్టులో మొత్తం 30 ఎకరాల్లో 18 ఎకరాల్లో కుంకుమ పువ్వు సాగు చేయనుండగా, 3 ఎకరాల్లో ఇండోర్ పర్యావరణ పరిరక్షణ యూనిట్లు, మిగిలిన 9 ఎకరాల్లో ప్రాసెసింగ్ సెంటర్, పరిశోధన, శిక్షణా కేంద్రాలు, పరిపాలనా భవనాలు ఏర్పాటు చేయనున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన స్నాప్ గ్రీన్‌మ్యాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక గిరిజన మహిళలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే రాష్ట్రంలో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటల సాగుకు కొత్త మార్గం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సుగంధ ద్రవ్యాల బోర్డు, సేంద్రీయ ధృవీకరణ సంస్థలు, ఉద్యానవన శాఖ నుంచి అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే భూమి అధికారికంగా కేటాయించి సాగు ప్రారంభించనున్నారు.
దేశంలో ప్రస్తుతం కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే ప్రధానంగా కుంకుమ పువ్వు సాగు జరుగుతోంది. దేశీయంగా డిమాండ్ సుమారు 100 టన్నులు ఉండగా, ఉత్పత్తి మాత్రం కేవలం 3.46 టన్నులే. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రారంభమవుతున్న ఈ ప్రాజెక్టు దేశీయ ఉత్పత్తిని పెంచడంలో కీలకంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)