తాడిపత్రి బిర్యానీ టేస్ట్ సీక్రెట్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి దమ్ బిర్యానీ తన ప్రత్యేక రుచితో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. రాయలసీమతో పాటు తెలంగాణ, కర్ణాటకలో కూడా ఈ బిర్యానీకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ప్రత్యేకమైన తయారీ విధానం, నాణ్యమైన దినుసులు, సంప్రదాయ దమ్ పద్ధతే ఈ బిర్యానీ విజయానికి ప్రధాన కారణాలుగా చెబుతారు.
తాడిపత్రి బిర్యానీ తయారీలో ప్రత్యేకంగా రెండు పొయ్యిల విధానాన్ని అనుసరిస్తారు. ఒక పొయ్యిపై మటన్ కూరను ఉడికిస్తే, మరో పొయ్యిపై బియ్యాన్ని సగం వరకు ఉడికిస్తారు. అనంతరం మటన్‌పై బియ్యాన్ని లేయర్లుగా వేసి, నెయ్యి చల్లి , గిన్నెపై మూతపెట్టి కిందా పైనా నిప్పులు పెట్టి దమ్ చేస్తారు. ఈ సంప్రదాయ విధానమే బిర్యానీకి ప్రత్యేకమైన రుచి, సువాసనను అందిస్తుంది.
ఈ బిర్యానీలో నంద్యాల సోనా మసూరి బియ్యం, నాణ్యమైన పొట్టేలు మాంసం మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే కేరళ నుంచి తెప్పించే చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, స్టార్ అనిస్, షాజీరా, కసూరి మేతి వంటి తొమ్మిది రకాల మసాలాలతో ప్రత్యేక గరం మసాలా తయారు చేస్తారు. నూనె, నెయ్యి, పెరుగు వంటి పదార్థాల్లో కూడా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
తాడిపత్రి బిర్యానీకి మరో ప్రత్యేకత గోంగూర పచ్చడితో అందించే కాంబినేషన్. ఈ రుచి కారణంగానే అనంతపురం, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా ఈ పేరుతో అనేక హోటళ్లు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ అసలైన తాడిపత్రి దమ్ బిర్యానీ రుచిని ఆస్వాదించాలంటే తాడిపత్రికే వెళ్లాలని ఫుడ్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)