మైపాడు బీచ్‌కు త్వరలో అంతర్జాతీయ గుర్తింపు?.. ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ కోసం వేగంగా ఏర్పాట్లు
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు బీచ్ త్వరలో అంతర్జాతీయ గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తోంది. బీచ్‌కు ప్రతిష్ఠాత్మక ‘బ్లూ ఫ్లాగ్’సర్టిఫికేషన్ సాధించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ గుర్తింపు లభిస్తే మైపాడు బీచ్ అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో చోటు దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన సముద్ర తీరాల్లో మైపాడు బీచ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. విశాలమైన బీచ్, పచ్చని పరిసరాలు, రిసార్టులు, వసతి సౌకర్యాలు, రుచికరమైన ఆహారం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైకి సమీపంలో ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ఐదు బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుండగా, అందులో మైపాడు బీచ్ కూడా ఒకటి. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, భద్రత, నీటి నాణ్యత, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు వంటి అంతర్జాతీయ ప్రమాణాలను పాటించే బీచ్‌లకే ఈ గుర్తింపు లభిస్తుంది.
ప్రతి వారాంతంలో మైపాడు బీచ్‌కు వందలాది మంది సందర్శకులు వస్తుండగా, పండుగల సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ప్రతి ఏడాది జనవరిలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం అధికారులు సముద్ర జలాల నాణ్యతను నిరంతరం పరీక్షిస్తున్నారు. అలాగే బీచ్‌లో డ్రెస్సింగ్ రూములు, లైఫ్ గార్డులు, అత్యవసర సహాయక బృందాలు, సీసీటీవీ నిఘా, రాత్రి వేళల్లో లైటింగ్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించారు.
ఈ గుర్తింపు లభిస్తే పర్యాటక రంగంతో పాటు స్థానిక మత్స్యకారులు, చిన్న వ్యాపారులు, ఇతర జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)