ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు, జ్వరాల ఓపీలు ఏర్పాటు చేసి అవసరమైన చికిత్సా ఏర్పాట్లు చేపడుతోంది.
గుంటూరు జిల్లాలోని ఎయిమ్స్‌లో వరుసగా కరోనా కేసులు నమోదవుతుండగా, గుంటూరు ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో కూడా మరో పాజిటివ్ కేసు నమోదైంది. మంగళగిరి, నవులూరు, దుగ్గిరాల, చినకాకాని ప్రాంతాలకు చెందిన పలువురికి కరోనా నిర్ధారణ కాగా, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
వైద్యుల సూచనల ప్రకారం ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ తీవ్ర ప్రమాదకరం కాకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, అవసరమైన చోట మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగించడం, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)