పుట్టినరోజు సందర్భంగా అన్నా కొణిదెల గొప్ప నిర్ణయం.. జూలో ఏనుగు, పులిని దత్తత

Aug 01, 2026 - 14:07
0 2
పుట్టినరోజు సందర్భంగా అన్నా కొణిదెల గొప్ప నిర్ణయం.. జూలో ఏనుగు, పులిని దత్తత

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తన పుట్టినరోజు సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పడే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌లో ఒక ఆసియా ఏనుగు, ఒక రాయల్ బెంగాల్ పులిని ఏడాది పాటు దత్తత తీసుకుని మొత్తం రూ.6.30 లక్షల విరాళాన్ని అందించారు.

జూ అధికారుల వివరాల ప్రకారం, ఆసియా ఏనుగు సంరక్షణ కోసం రూ.4.30 లక్షలు, రాయల్ బెంగాల్ పులి సంరక్షణ కోసం రూ.2 లక్షలు విరాళంగా చెల్లించారు. ఈ సందర్భంగా జంతు దత్తతకు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జూ క్యూరేటర్ జి. మంగమ్మ అన్నా కొణిదెల తరపున అందజేశారు.

ఈ సందర్భంగా జూ క్యూరేటర్ మంగమ్మ మాట్లాడుతూ, పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో వన్యప్రాణుల సంరక్షణకు విరాళాలు అందించడం సమాజానికి ఆదర్శప్రాయమని అన్నారు. ఏనుగు, పులి ఆహారం, వైద్య సేవలు, సంరక్షణ, ఇతర అవసరాల కోసం ఈ నిధులను వినియోగిస్తామని తెలిపారు.

విశాఖ ఇందిరాగాంధీ జూలో జంతువుల దత్తత కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా 3 నెలలు, 6 నెలలు లేదా ఏడాది కాలానికి జంతువులను దత్తత తీసుకునే అవకాశం ఉంది.

దత్తత తీసుకున్న వారి పేర్లను ఆయా జంతువుల ఎన్‌క్లోజర్ ముందు ప్రదర్శిస్తారు. అలాగే అధికారిక దత్తత సర్టిఫికేట్, ప్రత్యేక దత్తత కార్డు, ఉచిత ప్రవేశ పాస్‌లు అందజేస్తారు. అంతేకాకుండా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80G(5) ప్రకారం పన్ను మినహాయింపు సదుపాయం కూడా లభిస్తుంది.

అన్నా కొణిదెల తీసుకున్న ఈ నిర్ణయం వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడంతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో మరింత మంది భాగస్వాములు కావడానికి ప్రేరణగా నిలుస్తుందని జూ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User