'ప్రాణం ఉన్నంత వరకూ బీఆర్ఎస్లో చేరను'.. రూ.1,400 కోట్లపై కవిత సంచలన ఆరోపణలు
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్తగూడెంలోని పీవీకే-5 గనిలో నిర్వహించిన 'సింగరేణి బాయి బాట' కార్యక్రమంలో కార్మికులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు."నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్లో చేరను. ఆ పార్టీతో ఎలాంటి సంబంధం పెట్టుకోను" అని కవిత తేల్చిచెప్పారు. వ్యక్తిగతంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.1,400 కోట్లపై ఆరోపణలు
బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు చెబుతున్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రో కో కింద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్ల నుంచి వచ్చినవే కాదా? అని కవిత ప్రశ్నించారు. ఆ నిధులను తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
భూముల కేటాయింపులపై రివ్యూ
తమ పార్టీ అధికారంలోకి వస్తే 2014 నుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు వివిధ సంస్థలకు కేటాయించిన భూములన్నింటినీ సమీక్షిస్తామని కవిత ప్రకటించారు. ప్రజల మధ్యే ఉంటూ ఉద్యమాలు కొనసాగిస్తానని ఆమె తెలిపారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియాకు హెచ్చరిక
తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను కవిత హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు మానుకోవాలని, హద్దులు దాటవద్దని సూచించారు. తమ పార్టీ కార్యకర్తలు కూడా వ్యక్తిగత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
హరీశ్ రావు, కేటీఆర్‌పై ఆరోపణలు
హరీశ్ రావుపై కూడా కవిత విమర్శలు గుప్పించారు. అలాగే కేటీఆర్ తన సన్నిహితులకు అక్రమ అనుమతులు ఇచ్చారంటూ ఆరోపించారు. ఫినిక్స్ సంస్థకు భారీ స్థాయిలో భూములు కేటాయించారని, అటవీ శాఖ కేసులను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కాళేశ్వరం, రైతుల అంశంపై విమర్శలు
రైతుల సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని కవిత ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులకు నష్టం కలగకుండా ప్రాజెక్టును వినియోగించుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
సింగరేణిపై కీలక వ్యాఖ్యలు
సింగరేణి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కవిత ఆరోపించారు. సంస్థకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సింగరేణిలో అధికారులు, కార్మికులకు వేర్వేరు నిబంధనలు అమలవుతున్నాయని విమర్శించారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సింగరేణికి చెందిన మిగిలిన బొగ్గు గనులను కూడా సంస్థకే కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)