TGSRTCకి కాసుల వర్షం.. పదేళ్ల తర్వాత రూ.1,059 కోట్ల రికార్డు లాభం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పదేళ్ల నష్టాల పరంపరకు తెరదించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాదిలో సంస్థ రూ.1,059.2 కోట్ల వార్షిక లాభాన్ని ఆర్జించి, సంస్థ చరిత్రలోనే అత్యధిక మిగులును నమోదు చేసింది.
టీజీఎస్‌ఆర్‌టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సంస్థ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచింది. ఈ పథకం అమలుతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగి, ఆక్యుపెన్సీ రేషియో 67 శాతం నుంచి 98 శాతానికి చేరుకుంది.
అంతేకాకుండా టోల్ ఛార్జీలు, సేఫ్టీ సెస్, రౌండ్-అప్ ఛార్జీల సవరణలు, ప్రభుత్వం సకాలంలో నిధుల రీయింబర్స్‌మెంట్ చేయడం, సంస్థ చేపట్టిన ఖర్చుల నియంత్రణ చర్యలు కూడా లాభాల పెరుగుదలకు దోహదపడ్డాయని అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి టీజీఎస్‌ఆర్‌టీసీ రూ.9,639.5 కోట్ల ఆదాయం, రూ.8,520.6 కోట్ల వ్యయం, రూ.1,118.8 కోట్ల లాభాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 2023లో ప్రారంభమైన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సంస్థ పునరుజ్జీవనానికి ప్రధాన కారణమైందన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తూ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2014-15లో రూ.3,294 కోట్లుగా ఉన్న టీజీఎస్‌ఆర్‌టీసీ ఆదాయం.. 2025-26 నాటికి రూ.9,374.18 కోట్లకు చేరడం సంస్థ సాధించిన ప్రగతికి నిదర్శనంగా అధికారులు పేర్కొన్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)