తెలంగాణలో మూడు కొత్త ఎయిర్‌పోర్టులు..మంత్రి కీలక ప్రకటన

Jul 01, 2026 - 15:37
0 2
తెలంగాణలో మూడు కొత్త ఎయిర్‌పోర్టులు..మంత్రి కీలక ప్రకటన

తెలంగాణలో పౌర విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త ఎయిర్‌ఫీల్డ్‌లు (విమానాశ్రయాలు) అభివృద్ధి చేయనున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఏరోమార్ట్ హైదరాబాద్-2026 సదస్సులో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపాదిత వరంగల్ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణానికి వచ్చే నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆదిలాబాద్‌లో సివిల్, మిలిటరీ అవసరాలకు అనుగుణంగా సంయుక్త ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మూడు విమానాశ్రయాల ద్వారా తెలంగాణలో రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా వరంగల్, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల అభివృద్ధికి ఇవి కీలకంగా మారనున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణ దేశంలోనే ప్రముఖ కేంద్రంగా ఎదుగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,500కు పైగా ఎంఎస్‌ఎంఈలు ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు అవసరమైన విడిభాగాలను తయారు చేస్తున్నాయని వెల్లడించారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జపాన్, ఇజ్రాయెల్, కెనడా వంటి దేశాల కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు.

ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన టాటా సికోర్స్కీ, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, సఫ్రాన్, జీఈ ఏరోస్పేస్, హనీవెల్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి వివరించారు. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లు, అపాచీ హెలికాప్టర్ల ఫ్యూజ్‌లేజ్‌లు, ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కలు వంటి కీలక భాగాలు తెలంగాణలోనే తయారవుతున్నాయని తెలిపారు.

ఈ సదస్సులో జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు, డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో వేగంగా ఎదుగుతోందని, అంతర్జాతీయ సరఫరా గొలుసులో హైదరాబాద్ కీలక కేంద్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ఏరోస్పేస్ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User